Congress 3rd List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, కాంగ్రెస్ 19, బీజేపీ 31 స్థానాలకు టికెట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇందులో 9 స్థానాలు జనసేనకు ఇవ్వనున్నట్లు బీజేపీ ప్రకటించింది. నామినేషన్లకు ఇంకా నాలుగు రోజులే గడువు ఉంది. దీంతో అభ్యర్థుల ప్రకటనపై అన్ని పార్టీలు దృష్టిపెట్టాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి కాంగ్రెస్ 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందరూ ఊహించినట్లుగా, మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే టీపీసీసీ చీఫ్ కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టబోతున్నారు. ఈమేరకు మూడో జాబితాలో కాంగ్రెస్ అతడిని అభ్యర్థిగా ప్రకటించింది. కామారెడ్డికి ముందు నుంచీ అనుకుంటున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ స్థానం కేటాయించారు. తాజా జాబితాలో.. గతంలో ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల స్థానాలను అధిష్టానం మార్చింది. గతంలో బోథ్ (ఎస్టీ) స్థానంలో వెన్నెల అశోక్, వనపర్తిలో మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. తాజా ప్రకటనతో బోథ్ ఆడె గజేందర్, వనపర్తిలో తూడి మేఘారెడ్డి బరిలో దిగనున్నారు.
114 స్థానాలకు అభ్యర్థులు..
మూడో జాబితాతో మొత్తంగా 114 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి ఇప్పటికే కేటాయించారు. ఇక సూర్యాపేట, తుంగతుర్తి (ఎస్సీ), చార్మినార్, మిర్యాలగూడ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు లేదంటూ సీపీఎం ఇప్పటికే అభ్యర్థుల జాబితా వెలువరించింది. మిర్యాలగూడ నుంచి తమ అభ్యర్థిగా జూలకంటి రంగారెడ్డిని ప్రకటించింది. అయినా మిర్యాలగూడకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. సీపీఎంతో ఇంకా పొత్తు కుదిరే అవకాశాలున్నాయని కాంగ్రెస్ భావిస్తున్నందునే ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచినట్లు సమాచారం. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి మధ్య తీవ్రపోటీ నెలకొనడంతో సూర్యాపేట స్థానాన్ని పెండింగ్లో ఉంచారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిన తర్వాతే అక్కడ అభ్యర్థిని ప్రకటించాలని అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. సూర్యాపేటపై.. తుంగతుర్తి టికెట్ ఆధారపడి ఉండటంతో దాన్ని కూడా పెండింగ్‌లో ఉంచారు. చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మదఖాన్‌కు ఎంఐఎం టికెట్ ఇవ్వలేదు. ఆయన కాంగ్రెస్ గూటికి చేరితే బరిలో దించాలనే యోచనతో.. పార్టీ ఆ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది. చెన్నూరు(ఎస్సీ), బాన్సువాడ స్థానాలను బీజేపీ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ జి.వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి కేటాయించారు.