https://oktelugu.com/

TV9: అతి సర్వత్రా వర్జయేత్: టీవీ 9 కు ఎప్పుడు బోధపడుతుంది?

టీవీ9 వాస్తవంగా మొదటి నుంచి నెంబర్ వన్ స్థానంలో ఉండేది. మొదట్లో మంచి మంచి వార్తలు ప్రజెంట్ చేసేది. తర్వాత దాని పంథా పూర్తిగా మార్చుకుంది. వార్తకు బదులు హడావిడి ఎక్కువ చేయడం మొదలు పెట్టింది.

Written By:
  • Rocky
  • , Updated On : June 6, 2023 11:44 am
    TV9

    TV9

    Follow us on

    TV9: చెరపకురా చెడేవు.. అని మన పెద్దలు కొరకే అనలేదు. దీని ఫలితాన్ని టీవీ9 చేజేతులా అనుభవిస్తుంది. మొన్ననే కదా ఎన్ టీవీ ని దాటేసి మొదటి స్థానాన్ని మళ్లీ కొట్టేసామని సంబరాలు జరుపుకున్నది.. కుట్రలు ఎన్నటికీ దాగవని ఏకంగా ఫ్లెక్సీలు, అడ్వర్టైజింగ్ బోర్డులు ఏర్పాటు చేసింది.. అలా చేసి రెండు వారాలు గడవక ముందే టీవీ9 కు అసలు తత్వం బోధపడింది. అప్పట్లో ఎన్ టీవీ ని ఒక్క అడుగు తేడాతో వెనక్కి నెట్టిన టీవీ9.. ఇప్పుడు ఏకంగా ఐదు అడుగులు వెనక్కి వెళ్ళింది. తనకు సమీప దూరంలో ప్రత్యర్థి ఎవరూ లేకపోవడం వల్ల రెండవ స్థానంలో ఉంది గాని.. పోటీ ఛానల్ ఏదైనా ఉంటే ఆ స్థానానికి కూడా బొక్క పడటం ఖాయం.

    హడావిడి దేనికి

    వార్తను వార్తలాగా చూపిస్తే ఎవరికీ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ వార్త కంటే హడావిడి ఎక్కువ చేయడం ద్వారానే టీవీ9 అభాసుపాలవుతున్నది. న్యూస్ కంటే న్యూసెన్ ఎక్కువ చేయడం ద్వారా చూసే ప్రేక్షకులకు ఏవగింపు కలుగుతుంది. వాస్తవానికి ఆ న్యూస్ ఛానల్స్ రేటింగ్స్ అనేదే ఒక పెద్ద దందా. ఆమధ్య రిపబ్లిక్ టీవీ నెంబర్ వన్ స్థానం దక్కించుకునేందుకు ఎలాంటి అడ్డదారులు తొక్కిందో మనం చూశాం కదా! ఇక అలాంటి రేటింగ్స్ ప్రామాణికంగా వందలాదికోట్ల దక్కించుకునేందుకు వివిధ ఛానల్స్ రకరకాల ప్రయత్నాలు చేశాయి. ఇదంతా మొత్తం దందా అని తేలడంతో తర్వాత రేటింగ్స్ ప్రక్రియ కొద్ది రోజులు ఆగిపోయింది. కోవిడ్ సమయంలో ఇది దాదాపుగా అటకెక్కింది. ఇప్పుడు రేటింగ్స్ ప్రక్రియ మొదలైంది. జాతీయ మీడియాను కాస్త అలా వదిలేస్తే.. తెలుగు నాట మీడియా విషయంలోనూ ఇందుకు మినహాయింపు ఏమీ లేదు. ఈ రేటింగ్స్ కోసం వివిధ రకాల చానల్స్ తొక్కుతూనే ఉన్నాయి. వందల కోట్ల యాడ్స్ను అప్పనంగా పొందేందుకు అడ్డదారుల్లో పయనిస్తూనే ఉన్నాయి. ఈ అడ్డదారుల్లో రేటింగ్స్ తగ్గించుకొని మేమే నెంబర్వన్ అంటూ జబ్బలు చరుచు కుంటున్నాయి.

    నేల విడిచి సాము

    టీవీ9 వాస్తవంగా మొదటి నుంచి నెంబర్ వన్ స్థానంలో ఉండేది. మొదట్లో మంచి మంచి వార్తలు ప్రజెంట్ చేసేది. తర్వాత దాని పంథా పూర్తిగా మార్చుకుంది. వార్తకు బదులు హడావిడి ఎక్కువ చేయడం మొదలు పెట్టింది. దీనికి తోడు కవరేజ్ విషయంలోనూ అతికి ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో ఎన్టీవీ ప్లెయిన్ అండ్ నీట్ కవరేజ్ ను నమ్ముకుంది. దానికి తోడు యాజమాన్యం కూడా క్షేత్రస్థాయిలో నెట్వర్క్ ను బలంగా రూపొందించడంలో విశేషమైన కృషి చేసింది. అంకెల మాయాజాలమే అయినప్పటికీ ఆ రేటింగ్స్ విషయంలో ఎన్టీవీ నెంబర్ వన్ స్థానానికి వచ్చింది. ఎన్టీవీ వచ్చింది అనేకంటే టీవీ9 పూలల్లో ఆ స్థానాన్ని ఎన్టీవీ కి అప్పగించింది. చాలాకాలం ఇలా జరిగిన తర్వాత టీవీ9 మళ్లీ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది. అయితే కేవలం ఒక పాయింట్ తేడాతోనే ఎన్ టీవీ ని టీవీ9 అధిగమించింది. వాస్తవానికి ఈ నెంబర్ వన్ స్థానం అనేది ఎప్పుడు శాశ్వతం కాదు అని టీవీ9 కు తెలుసు. అయినప్పటికీ తన కార్యాలయంలో నానా హంగామా చేసింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ నెంబర్ వన్ డప్పు కొట్టుకోవడంలోనే తరించింది. మెరుగైన సమాజం కోసం అంటూ ట్యాగ్ లైన్ తగిలించుకున్న టీవీ9.. ఇలా చేయడం జనాలకు నచ్చలేదు. కేవలం వారాల వ్యవధిలోనే టీవీ 9 మళ్లీ రెండవ స్థానానికి వచ్చింది. అందుకే అంటారు పెద్దలు అతి సర్వత్రా వర్జాయేత్ అని.. ఇది ఇప్పుడు టీవీ9 కు అనుభవంలోకి వస్తోంది..

    పోటాపోటీ

    ఇక ఈ విషయంలో ఎన్టీవీ కూడా శుద్ధ పూస కాదు. టీవీ9 సంబరాలు చేసిందని.. ఆ చానల్ కూడా అలాంటి ధోరణినే ప్రదర్శించింది. తన కార్యాలయంలో వేడుకలు చేసింది. ఒక అడుగు తేడాతో గతంలో నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన ఎన్ టీవీ.. ఈసారి ఏకంగా ఐదు పాయింట్లు తేడాతో టీవీ9 పై పై చేయి సాధించింది. టీవీ 9 స్థాయిలో కాకున్నా..తన పరిధిలో హోర్డింగులు ఏర్పాటు చేసింది. ఎన్నికల కాలం కావడంతో రెండు చానల్ కూడా పోటాపోటీగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఎందుకంటే ఈ కాలంలో ఏ ఛానల్ అయితే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందో.. దానికే కోట్ల యాడ్స్ రూపంలో వస్తాయి. వాటిని దక్కించుకునేందుకు ఈ రెండు చానల్స్ పోటీ పడుతున్నాయి. అయితే ఈ రెండు చానల్స్ కు సమీపంలో మరి ఇతర ఛానల్ లేకపోవడంతో.. ఈ రెండు యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ నెంబర్ల ఆటలో ఎన్టీవీ కాస్త మెరుగైన దశలో ఉంది. అలాగని ఈ స్థానం గ్యారంటీ అని చెప్పలేం. టీవీ9 నెంబర్ వన్ ర్యాంకును రెండుసార్లు పోగొట్టు కుంది కాబట్టి.. రజనీకాంత్ ఏమైనా మాయ చేస్తాడో వేచి చూడాలి. అసలే తన మాతృ సంస్థ తనకు దక్కకుండా పోయిందనే కోపంలో ఉన్న రవి ప్రకాష్ టీవీ 9 పతనానికి తెర వెనుక కృషి చేస్తున్నాడు అనే ఆరోపణలు లేకపోలేదు. ఏది ఏమైతేనేం వార్తలు ప్రసారం చేయాల్సిన ఛానల్స్.. తామే వార్తల్లో ఉండడం నిజంగా పిటీ.