Kurnool: రాయలసీమ.. రతనాల సీమ. రాయలు ఏలిన నేల కావడంతో రత్నాలు ఉంటాయని నమ్మకం. కానీ ఇది నిజం. చాలా సందర్భాల్లో ఇది నిజమైంది. అనేకసార్లు వజ్రాలు, రతనాలు లభ్యమయ్యాయి. ఒక్క లక్కీ స్టోన్ తో లక్ మార్చుకున్న వారు ఎంతో మంది రాయలసీమలో ఉన్నారు. రాత్రికి రాత్రే కోటేశ్వరులు అయిన వారు ఉన్నారు. అందుకే తొలకరి వానలు ప్రారంభమైతే చాలూ.. సాగు కోసం కాకుండా వజ్రాల వేట సాగిస్తుంటారు కర్నూలు,అనంతపురం సరిహద్దు ప్రాంత రైతులు. ఏరువాక దుక్కితో నేలనే నిశితంగా పరిశీలిస్తారు. ఎటువంటి రాయి బయటపడినా వెంటనే వ్యాపారులను ఆశ్రయిస్తారు. ఇలా ఓ రైతుకు దొరికిన రతనాలరాయి విలువ ఎంతో తెలుసా అక్షరాలా రూ.2 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.
రాసుల పోసి వజ్రాలు అమ్మే చరిత్ర రాయలసీమది. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో వజ్రాలు రాసులుగా పోసి విక్రయించే వారని చరిత్ర చెబుతోంది. అందుకే ఇప్పటికీ అక్కడ వజ్రాలు, రతనాలు ఉంటాయని ప్రజల ప్రగాఢ నమ్మకం. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో విలువైన వజ్రాలు దాగున్నాయని చెబుతున్నారు. వర్షం వస్తే ఇక్కడి నేలలపై పంటలు పండుతాయో లేదోగానీ.. వజ్రాలు మాత్రం పండుతాయని నమ్మకం. అందుకే వాన పడినప్పుడల్లా ఇక్కడి ప్రజలు వజ్రాన్వేషణలో ఉంటారు. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు వేట ప్రారంభించారు.
సాధారణంగా తొలకరి వానలు ప్రారంభమైతే రైతులు విత్తనాలు చల్లుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. కానీ రాయలసీమలో మాత్రం అందుకు విరుద్ధం. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా అందరూ పొలాల బాట పడతారు. ఇలా అదృష్టం తడితే చాలు రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిన వారూ ఉన్నారు. తాజాగా మద్దెకర మండలంలోని బసినేపల్లిలో ఓ రైతుకు వజ్రం కళ్లబడింది. ఆ వజ్రాన్ని అక్కడే అమ్మకానికి పెట్టాడు. అక్కడే వేచి చూస్తున్న వ్యాపారికి అమ్మకానికి పెడితే.. దాన్ని రూ. 2కోట్లు పలికినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆ నోట.. ఈ నోట పాకడం.. ఇప్పుడు జనమంతా పొలాల్లో వెదుకులాట ప్రారంభించారు. వర్షం పడితే చాలు పొలం బాట పడుతున్నారు.