Polavaram Project: అంతుపట్టని కేంద్రం అంతరంగం.. పోలవరానికి రూ.13 వేల కోట్ల కథేంటి

ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో రావాల్సిన రెవెన్యూ లోటు బ‌డ్జెట్ నిధులను మోదీ సర్కారు విడుదల చేసింది. రూ.10 వేల కోట్ల‌కు పైగా నిధులు రాష్ట్రానికి వ‌చ్చాయి. ఇప్పుడు పోలవరానికి సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

Written By: Bhaskar, Updated On : June 6, 2023 11:48 am

Polavaram Project

Follow us on

Polavaram Project: కేంద్రంలోని మోదీ సర్కారు అంతరంగం అంతుపట్టడం లేదు. ఒక వైపు ప్రభుత్వపరంగా జగన్ సర్కారుకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. మరోవైపు విపక్ష టీడీపీతో రాజకీయ చర్చలు నడుపుతోంది. ఢిల్లీ పెద్దల చర్యలను ఏ రీతిలో అర్ధం చేసుకోవాలో తెలియడం లేదు. ఎప్పుడో చంద్రబాబు కాలం నాటి రెవెన్యూ లోటు రూ.10 వేల కోట్లను మంజూరు చేసిన కేంద్రం ..ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12,911,15 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే ఇది జగన్ కు అనుకూల నిర్ణయంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ బీజేపీ వర్గాలు మాత్రం ఏపీపై ప్రధాని మోదీకి ఉన్న నిబద్ధత అని చెప్పుకొస్తున్నాయి.

ఏపీ విభ‌జ‌న స‌మ‌యంలో రావాల్సిన రెవెన్యూ లోటు బ‌డ్జెట్ నిధులను మోదీ సర్కారు విడుదల చేసింది. రూ.10 వేల కోట్ల‌కు పైగా నిధులు రాష్ట్రానికి వ‌చ్చాయి. ఇప్పుడు పోలవరానికి సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దాదాపు 13 వేల కోట్ల నిధుల‌ను విడుద‌ల చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. అంతేకాదు, ప్ర‌స్తుత రేట్ల‌తో నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీక‌రించ‌డం విశేషం. బిల్లుల చెల్లింపుల్లో ప‌రిమితుల‌ను తొల‌గించ‌డానికి కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. ఇలా అనేక సానుకూల అంశాల‌తో ఏపీ జ‌ల‌వ‌న‌రుల‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ‌శిభూష‌ణ్ కుమార్‌కు కేంద్ర ఆర్థిక‌శాఖ డైరెక్ట‌ర్ ఎల్‌కే త్రివేది ఒక లేఖ‌ను రాశారు. అయితే దీనిపై భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల ఏడాది కేంద్ర ప్రభుత్వం ఏపీపై ఉదారత చూపిస్తుండడంపై రాజకీయంగా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కారును గట్టెక్కించేందుకు, మరోసారి చంద్రబాబును ఓడించేందుకే ప్లాన్ చేశారన్న కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తరుపున ఏపీకి ఉదారంగా ఆదుకున్నామని చెప్పేందుకు దోహదపడుతుందని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు నిధులు విడుదల చేయడంతో విస్తృత ప్రచారం దక్కి అది అల్టిమేట్ గా బీజేపీకే లాభం చేకూరుస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే గత తొమ్మిదేళ్లలో ఏపీకి విడుదల చేసిన నిధులు ఇవి అంటూ బీజేపీ ప్రత్యేక బుక్ లెట్ రూపొందించి ప్రచారం ప్రారంభించింది.

ఇటీవ‌ల కాలంలో ప్ర‌తిదీ జ‌గ‌న్‌కు సానుకూల నిర్ణ‌యాలు రావ‌డంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. కానీ ఈ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం హైలెట్ అవుతోంది. అది తమకు ప్లస్ గా మారుతుందని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారు. రేపటి ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చూసినా సీట్ల పరంగా డిమాండ్ చేయడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. ఈ నిధులపై విపక్షాలు ప్రచారం అంతిమంగా తమకే లాభిస్తుందన్న కోణంలో హైకమాండ్ నేతలు ఆలోచిస్తున్నట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే పోలవరం ప్రాజెక్టుకు నిధుల ప్రకటన సమయంలో ఏపీ సీఎం జగన్ ఆ ప్రాంతంలో పర్యటిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.