https://oktelugu.com/

Telangana High Court: కుక్కల నుంచి కాపాడకపోతే సర్కార్‌ ఉండి ఎందుకు? లేక ఎందుకు?.. రేవంత్‌ సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం!

జీహెచ్‌ఎంసీలో రోడ్ల పక్కనే చెత్త వేస్తున్నారు. మున్సిపల్‌ సిబ్బంది కూడా చెత్తను రోడ్డ పక్కనే డంప్‌ చేస్తున్నారు. జనావాసాల మధ్య గుట్టలుగా చెత్త పేరుకుపోతోంది. దీని కారణంగా కూడా కుక్కలు పెరుగుతున్నాయి’ అని కోర్టు తెలిపింది. పారిశుధ్య నిర్వహణలో పాలకులు విఫలమయ్యారని పరోక్షంగా విమర్శించింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 18, 2024 3:06 pm
    Telangana High Court

    Telangana High Court

    Follow us on

    Telangana High Court: తెలంగాణలో చిన్నారులపై వీధి కుక్కల వరుస దాడులపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడింది. వీధి కుక్కల నుంచి పిల్లలను రక్షించేందుకు మార్గాలు అన్వేషించాలని ఆదేశించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కుక్కల నుంచి కాపాడకపోతే సర్కార ఉండి ఎందుకే లేక ఎందుకు అని మండిపడింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 3.80 లక్షల వీధికుక్కలు ఉన్నాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. వాటన్నింటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని పేర్కొంది. రహదారుల పక్కన వేసే వ్యర్థాల వల్లే కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. వ్యర్థాలను నిర్మూలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

    రోడ్డంతా చెత్తేసి కుక్కలొస్తున్నాయ్‌ అంటే ఎలా..
    ‘జీహెచ్‌ఎంసీలో రోడ్ల పక్కనే చెత్త వేస్తున్నారు. మున్సిపల్‌ సిబ్బంది కూడా చెత్తను రోడ్డ పక్కనే డంప్‌ చేస్తున్నారు. జనావాసాల మధ్య గుట్టలుగా చెత్త పేరుకుపోతోంది. దీని కారణంగా కూడా కుక్కలు పెరుగుతున్నాయి’ అని కోర్టు తెలిపింది. పారిశుధ్య నిర్వహణలో పాలకులు విఫలమయ్యారని పరోక్షంగా విమర్శించింది.

    వారం క్రితం నోటీసులు..
    ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో వీధి కుక్కల బెడదపై వారం క్రితమే విచారణ జరిపిన కోర్టు వీధికుక్కల అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. వాటిని నియంత్రిచేందుకు అన్నిరకాల చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వీధికుక్కల దాడుల్లో చిన్న పిల్లలు మృతిచెందిన ఘటనలను గుర్తుచేసిన హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విధుల్లో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వీధికుక్కల దాడులు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

    ఆగని దాడులు..
    ఒకవైపు కోర్టు మందలిస్తున్నా అధికారుల్లో చలనం కానరావడం లేదు. వారం వ్యవధిలోనే పలుచోట్ల కుక్కల దాడి ఘటనలు వెలుగులోకి వచ్చాయి వారం వ్యవధిలోనే ఇద్దరు చిన్నారులను చంపేశాయి. ఈ తరుణంలో గురువారం(జూలై 18న) విచారణ జరిపిన కోర్టు.. ప్రభుత్వం తీరును తప్పు పట్టింది.