CM Revanth Reddy: బీఆర్ఎస్ ను దెబ్బకొట్టే రేవంత్ రెడ్డి భారీ వ్యూహం ఇదీ..

తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌) అధినేత తరచూ రాజీనామాలో ఉద్యమ ఊపును కొనసాగించేవారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఉప ఎన్నికల వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Written By: Raj Shekar, Updated On : September 6, 2024 4:09 pm

CM Revanth Reddy(8)

Follow us on

CM Revanth Reddy: తెలంగాణలో పది నెలల క్రితం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించిన ప్రజలు పదేళ్ల తర్వాత హస్తం పార్టీకి పట్టం కట్టారు. రేవంత్‌రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ 64 సీట్లు గెలవగా మిత్రపక్షం సీపీఐ ఒక సీటు గెలిచింది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు 60 సీట్లు అవసరం. మ్యాజిక్‌ ఫిగర్‌కు కేవలం 5 సీట్లే ఎక్కువగా ఉండడంతో బీఆర్‌ఎస్‌ నేతలు త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని, మళ్లీ కేసీఆర్‌ సీఎం అవుతారని ప్రచారం మొదలు పెట్టారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టారు. దీంతో పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరారు. మొదటగా ఖైతారాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లాం వెంకట్రావు, కడియం శ్రీహరి కాంగ్రెస్‌ గూటికి చేరారు. తర్వాత మరో ఏడుగురు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై బీఆర్‌ఎస్‌ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ పోరాటం చేస్తున్నారు. మొదట కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, వెంకట్రావు, శ్రీహరి కేసు విచారణ హైకోర్టులో పూర్తయింది. తీర్పు రిజర్వు చేసింది. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేల కేసు కూడా త్వరలోనే తుది దశకు వచ్చే అవకాశం ఉంది.

కేటీఆర్‌ చెప్పినట్లే జరుగుతుందా..
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఫిరాయింపు కేసు ఇప్పుడు కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ చెప్పిందే జరగబోతుందా అన్న చర్చ కూడా తెలంగాణలో జరుగుతోంది. కోర్టు తీర్పు రిజర్వు చేసిన నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందో అన్న టెన్షన్‌ ఇటు గులాబీ శ్రేణుల్లో, అటు కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తోంది.

రేవంత్‌ కొత్త ఎత్తుగడ..
మరోవైపు తెలంగాణ సీఎం కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీలో చర్చ జరుగుతోంది. కోర్టు తీర్పుకు ముందే.. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నికలు వస్తే గెలిచే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తద్వారా ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. బీఆర్‌ఎస్‌ నేతల నోరు మూయించడంతోపాటు ఫిరాయింపు ఆరోపణలకు చెక్‌ పెట్టవచ్చన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి అనర్హత వేటు పడే అవకాశం ఉండడంతో సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహం మార్చినట్లు చర్చ జరుగుతోంది.