Lok Sabha Election 2024: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. ఎన్నికల దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే.. 20కి పైగా రైళ్లకు తాత్కాలికంగా అదనపు కోచ్ లను ఏర్పాటు చేసింది. ఈరోజు నుంచి ఈనెల 14 వరకు ఈ కోచ్ లు అందుబాటులోకి రానున్నాయి.ప్రధానంగా ఏపీ ప్రజలు ఎక్కువగా తెలంగాణలో ఉపాధి పొందుతుంటారు. ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలు వస్తుంటారు. అటువంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సిపిఆర్ఓ సిహెచ్ రాకేష్ తెలిపారు.
ఇప్పటికీ వలస ఓటర్లను తరలించేందుకు అన్ని పార్టీలు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాయి. ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇప్పటికే దాదాపు ప్రైవేటు బస్సులు బుక్ అయ్యాయి. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు విపరీతమైన గిరాకీ ఉంది. వలస ఓటర్లను గ్రామాలకు రప్పించేందుకు.. వారికి రాను పోను ఖర్చులు ఇచ్చేందుకు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు డిసైడ్ అయ్యారు. కొందరికి ముందస్తుగానే ఫోన్ పే చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారు స్వగ్రామాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇప్పటికే రైల్వే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే అదనపు కోచ్ లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
సికింద్రాబాద్ విశాఖపట్నం, మచిలీపట్నం బీదర్, కాచిగూడ గుంటూరు, కాచిగూడ రేపల్లె, రేపల్లె టు వికారాబాద్, గుంటూరు తిరుపతి, గుంటూరు వికారాబాద్, గుంటూరు విశాఖపట్నం, సికింద్రాబాద్ విజయవాడ, నరసాపూర్ ధర్మవరం, నర్సాపూర్ హుబ్లీ తదితర మార్గాల్లో నడిచే రైళ్లకు అదనపు కోచ్ లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు కొంత ఉపశమనం కలగనుంది. మే 10 నుంచి 14 వరకు ఆయా రైళ్లలో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసి, స్లీపర్, చైర్ కార్ అదనపు కోచ్లు అందుబాటులోకి రానున్నాయి.