AP Elections 2024: ఏపీలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపు సాయంత్రం తో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో వ్యూహ ప్రతి వ్యూహాల్లో ప్రధాన రాజకీయ పక్షాలు నిమగ్నమయ్యాయి. చివరి రోజు భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో నేతలు హోరెత్తించనున్నారు. పిఠాపురంలో రేపు పవన్ భారీ రోడ్ షోకు ప్లాన్ చేయగా.. జగన్ భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. దీంతో పిఠాపురంలో పొలిటికల్ హీట్ నెలకొంది. మరోవైపు ఈ రోడ్ షోకు చిరంజీవి రానున్నారని ప్రచారం జరుగుతోంది.
పిఠాపురంలో శనివారం పవన్ బల ప్రదర్శనకు దిగనున్నారు. ఇప్పటికే నామినేషన్ నాడు భారీ జన సందోహంతో పిఠాపురం కిటకిటలాడింది. రేపు అదే విధంగా మరోసారి ప్లాన్ చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పిఠాపురం పట్టణంలో ఈ రోడ్ షో కొనసాగనుంది. అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పిఠాపురంలో జగన్ భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఒకవేళ చిరంజీవి హాజరైతే ఏం మాట్లాడతారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ చిరంజీవి వస్తే.. మరికొందరు హీరోలు సైతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు చిరంజీవి చంద్రబాబుతో భేటీ అవుతారని ప్రచారం సాగుతోంది. ఆ ఇద్దరి ఉమ్మడి విలేకరుల సమావేశం సైతం ఏర్పాటు చేస్తారని సమాచారం. ఇప్పటికే కూటమికి చెందిన ఇద్దరు అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించారు. వారికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తాజాగా పవన్ కు మద్దతుగా ఒక వీడియో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి మాటల దాడిని ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే మెగా అభిమానులకు చిరంజీవి స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. ఇప్పుడు పిఠాపురం లో ప్రచారం చేయడంతో పాటు చంద్రబాబుతో విలేకరుల సమావేశంలో పాల్గొని.. కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కూటమికి మెగా అభిమానుల ఓట్లు పోలరైజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే చిరంజీవి వస్తానని కానీ.. రానని కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.