Teacher Transfers: ఉపాధ్యాయులు ఫుల్‌ ఖుషీ..!

బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కొంతమంది ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లారు. దీంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత వరుస ఎన్నికలతో దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 8, 2024 1:18 pm

Teacher Transfers

Follow us on

Teacher Transfers: గతేడాది సెపెటంబర్‌లో నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టింది. ఆమేరకు ప్రక్రియ ప్రారంభించింది. స్కూల్‌ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించింది. అలాగే స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలు కూడా చేపట్టింది. కొందరు బదిలీ స్థానాల్లో విధుల్లో చేరారు. కొందరు పాత స్థానంలోనే కొనసాగారు.

కోర్టు ఆదేశాలతో బ్రేక్‌..
బదిలీల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కొంతమంది ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లారు. దీంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. తర్వాత వరుస ఎన్నికలతో దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు విన్నవించాయి. దీంతో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన మరుసటి రోజే ప్రభుత్వం బదిలీల షెడ్యూల్‌ విడుదల చేసింది.

ప్రారంభమైన ప్రక్రియ..
బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ శనివారం(జూన్‌ 8) నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం షెడ్యూల్‌లో పేర్కొంది. మల్టీ జోన్‌ –1లో ఈ నెల 22 వరకు మల్టీజోన్‌–2 పరిధిలో ఈనెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బుర్రా వెంకటేశ్‌ తెలిపారు. కోర్టు కేసుల కారణంగా ఎక్కడ ఆగింతో అక్కడి నుంచే ప్రారంభిస్తామని తెలిపారు.

టెట్‌లో సంబంధం లేకుండా..
ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్‌ తప్పనిసరని గతంలో కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయులు డివిజన్‌ బెంచ్‌కు వెళ్లడంతో టెట్‌ తప్పనిసరికాదని కోర్టు తెలిపింది. దీంతో తాజాగా షెడ్యూల్‌ విడుదలైంది. మరోవైపు మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయులకు ఈ బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

12 వేల మందికి బదిలీలు..
తాజా షెడ్యూల్‌తో రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మందికి బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో 18,495 మందికి పదోన్నతులు లభించనున్నాయి. కోర్టు కేసు కారణంగా రంగారెడ్డి జిల్లాలో బదిలీలు, పదోన్నతులకు బ్రేక్‌ పడింది. రంగారెడ్డి మినహా రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు, పదోన్నతులకుప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రక్రియ మొత్తం జూన్‌ 23 నాటికి పూర్తి చేస్తారు.

ఉపాధ్యాయ సంఘాల హర్షం..
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత్‌రెడ్డి, సదానంద్‌గౌడ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంకు కృతజ్ఞతలు తెలిపారు. భాషా పండితుల పదోన్నతుల షెడ్యూల్‌ విడుదలైందని ఆర్‌యూపీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్‌ అబ్దుల్లా, తిరుమల కాంతికృష్ణ ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చక్రవర్తుల శ్రీనివాస్, కర్రెం గౌరీశంకర్‌ హర్షం వ్యక్తం చేశారు.