Ramoji Rao Passed Away: మార్గదర్శి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినా.. ఉండవల్లి అరుణ్ కుమార్ ఎలా ఇబ్బంది పెట్టినా.. రామోజీరావు భయపడలేదు. వెనక్కి తగ్గలేదు. నాటి ప్రభుత్వం కోరుకున్నట్టుగా మార్గదర్శి మీద వ్యతిరేకత రాలేదు. రామోజీకి వ్యతిరేకంగా ఒక్క గొంతు కూడా పెకల్లేదు. అది రామోజీరావు స్టామినా. వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, గోనె ప్రకాష్ రావు, వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఇలా ఎంతోమంది.. ఎన్నో విధాలుగా.. మరెన్నో రూపాలుగా.. రామోజీరావు నిలబడ్డాడు.. ధైర్యంగా ఎదుర్కొన్నాడు.. ఎందుకంటే అది ఉక్కు గుండె.. కానీ అంతటి రామోజీరావుకు శిక్ష పడింది.. బోను లో నిలబడాల్సి వచ్చింది.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో దివంగత మంత్రి వట్టి వసంత కుమార్ తండ్రి వట్టి వెంకట పార్థసారథి డిసిసిబి చైర్మన్ గా పనిచేస్తున్నారు. నాడు డిసిసిబి లో భారీగా అవినీతి జరిగిందని ఈనాడు పత్రికలో విపరీతంగా కథనాలు రాశారు. సహజంగానే నిజాయితీగా ఉండే పార్థసారధికి ఈ వ్యవహారం ఇబ్బందిగా అనిపించింది. వెంటనే ఆయన గవర్నమెంట్ అధికారులతో ఆడిట్ చేయించుకున్నారు. ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోలేదని ధృవీకరణ పత్రం తెచ్చుకున్నారు. ఆ తర్వాత తనమీద అడ్డగోలుగా వార్తలు రాసిన ఈనాడు పత్రిక మీద తాడేపల్లిగూడెం లో పరువు నష్టం దావా దాఖలు చేశారు.
ఈ కేసును అప్పటి తాడేపల్లిగూడెం జడ్జి విచారిస్తున్నారు. వార్త రాసిన విధానాన్ని మొత్తం పరిశీలించి రాసిన విలేకరి నుంచి ఎడిటర్ ఇన్ చీఫ్ దాకా కోర్టుకు హాజరు కావాల్సిందే అని ఆదేశాలు జారీ చేశారు. అప్పట్లో ఈనాడు ఎడిటర్ ఇన్ చీఫ్ గా రామోజీరావు ఉండేవారు. కోర్టు ఎదుట హాజరు నుంచి తప్పించుకునేందుకు రామోజీరావు అనేక విధాలుగా ప్రయత్నించారు. కానీ కుదరలేదు. చివరికి ఎలాగోలా వచ్చేందుకు ప్రయత్నించారు.. ప్రత్యేక విమానం ద్వారా బేగంపేట నుంచి గన్నవరం దాక వచ్చారు. అక్కడి నుంచి విశాలమైన బెంజ్ కార్లో తాడేపల్లిగూడెం కోర్టుకు వచ్చారు. జడ్జి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారు. సవినయంగా నమస్కారం చేశారు. అప్పటిదాకా రామోజీరావు ముందు చేతులు కట్టుకున్న వారే కానీ.. రామోజీరావు చేతులు కట్టుకొని నమస్కారాలు చేసిన వారు లేరు. తొలిసారి రామోజీరావుకు ఆ పరిస్థితి ఎదురైంది. కేసు విచారించిన అనంతరం రామోజీరావుకు తాడేపల్లిగూడెం AJFCM కోర్టులో రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష, అపరాధ రుసుము విధించారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ రామోజీరావు జిల్లా కోర్టుకు వెళ్లారు. అక్కడ ఈ కేసు కొట్టేశారు. అయితే తనపై నిరాధార వార్తలు రాసిన ఈనాడుపై పార్థసారథి పట్టుదలతో పోరాడారు. ఏకంగా ఏడు సంవత్సరాల పాటు కోర్టుకు తిరిగి శిక్ష పడేలాగా ప్రయత్నాలు చేశారు..
ఈ కేసు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో ఆరోజు విజిటర్స్ కోసం వేసిన బెంచి పై కూర్చుని మొత్తం వ్యవహారాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షిని.. కోర్టుకు హాజరయ్యే రామోజీని ఫోటో తీయ లేకుండా ఈనాడు సిబ్బంది గొడుగుతో అడ్డుపెట్టేలా చేశారు. ఆయన చుట్టూ వారే మూగారు. అంతేకాదు ఎవరూ ఎదురు పడకుండా తోసేశారు. కోర్టు హాల్లో రామోజీరావు బెంచ్ ముందుకు వెళ్లి నిలబడితే.. మెజిస్ట్రేట్ కు మరింత మండింది..” ముందు మీ క్లైంట్ కు ఎక్కడ నిలబడాలో చెప్పండి” అంటూ రామోజీ తరఫున న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు రామోజీరావు బోనులో నిలబడాల్సి వచ్చింది.. ఆమె మెజిస్ట్రేట్ పేరు జనమంచి సాంబశివరావు. ఆయన కాలినడకనే కోర్టుకు వచ్చేవారట. రేకు బాక్సులో ఫైల్స్ ను పెట్టి.. బంట్రోతు సైకిల్ వెనుక క్యారియర్ లో ఉంచేవారట. అతడు సైకిల్ తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంటే.. ఆయన వెనక నడిచి వెళ్లే వారట. ఆ రోజుల్లో తాడేపల్లిగూడెంలో ఆ దృశ్యం నిత్యం కన్పించేది. పైగా సాంబశివరావు నిక్కచ్చిగా ఉంటారని పేరు ఉండేది. హైకోర్టు, సుప్రీంకోర్టులలో నిష్ణాతులైన న్యాయవాదులతో పరిచయాలు ఉన్నప్పటికీ.. సుప్రీంకోర్టు జడ్జిలతో మాట్లాడే చనువు ఉన్నప్పటికీ.. సాంబశివరావు మాత్రం రామోజీరావును బోనులో నిలబెట్టాడు. చేతులు కట్టుకునేలా చేశాడు.