Telangana Temples: తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునే భక్తులు హుండీలో నగదు, బంగారాన్ని వేస్తూ ఉంటారు.. దీంతో స్వామివారి ఖాతాలలో భారీగా బంగారం నిల్వ ఉంటుంది.. ఈ బంగారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు బ్యాంకులలో భద్రపరుస్తూ ఉంటారు. ఇక నగదుకైతే లెక్కే ఉండదు. తెలుగు రాష్ట్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాస్త పక్కన పెడితే.. ఆ స్థాయిలో బంగారం వచ్చే ఆలయాలు చాలానే ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆలయాలలో కలిపి 1,048 కిలోల బంగారం, 38,783 కిలోల వెండి ఉంది. ఈ ఆలయాలలో అత్యధికంగా వేములవాడ రాజన్న ఆలయానికి 97 కిలోల బంగారం ఉంది.
ఈ కోవెల తర్వాత 67 కిలోల బంగారంతో భద్రాచలం, 61 కిలోలతో యాదగిరి గుట్ట ఆలయాలు ఉన్నాయి.. వేములవాడ రాజన్న ఆలయానికి గతంతో పోల్చితే ఇప్పుడు భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. కోడె మొక్కుల నుంచి మొదలుపెడితే బంగారం సమర్పణ వరకు ప్రతి విషయంలోనూ రాజన్న ఆలయం ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఇక్కడ సోమవారం, మంగళవారం రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఆదివారం కూడా భక్తుల రాక ఎక్కువయింది. అందువల్లే రాజన్న ఆలయం మరింత ప్రఖ్యాతలు పొందింది. ఈ ఆలయంలో స్వామివారు స్వయంభుగా ఉంటారు. అందువల్లే ఈ గుడికి విశేషమైన పేరు ఉంది.. ఇక భద్రాచలం కూడా విశేషమైన రామక్షేత్రంగా పేరు పొందింది. ఈ ఆలయంలో 67 కిలోల బంగారం ఉంది. రాముడు తెలుగువారికి ఇలవేల్పు కాబట్టి.. ఈ ప్రాంతానికి భక్తుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. పైగా ఈ ప్రాంతంలో గోదావరి నది ప్రవహిస్తూ ఉండడం.. రాముడి కోవెలకు విశేషమైన ప్రాచుర్యం ఉండడంతో ఈ ఆలయం అద్భుతమైన పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. తెలంగాణతోపాటు, ఆంధ్ర నుంచి కూడా భక్తులు విపరీతంగా వస్తూ ఉంటారు. స్వామివారికి బంగారంతో పాటు, నగదు, వెండి కానుకలు సమర్పిస్తుంటారు.. ఇక భద్రాచలం తర్వాత యాదగిరి గుట్ట ఆలయం కూడా విశేషమైన ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయం నూతన రూపు సంతరించుకోవడంతో భక్తులు విపరీతంగా రావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ ఆలయం వద్ద 61 కిలోల బంగారం ఉంది.. అయితే ఈ బంగారం కేవలం స్వామివారికి వచ్చిన కానుకల రూపంలోది మాత్రమే. ఇక ఈ బంగారం ఆయా ఆలయాల పరిధిలోనే ఉంటుంది.. ఇక కానుకల రూపంలో వచ్చిన బంగారాన్ని ఆలయ అవసరాల కోసం ప్రభుత్వ అనుమతితో మాత్రమే కరిగిస్తారు.
పెరిగిన భక్తి
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలు భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి. ఉదాహరణకు ఈ ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఆలయం భక్తులతో సందడిగా మారింది. వేలాదిమంది భక్తులు రావడంతో కానుకలు కూడా భారీగానే వచ్చాయి. ఇందులో బంగారం కూడా భారీగానే ఉంది. అయితే ప్రస్తుతం ఆలయాల హుండీల లెక్కింపు ఇంకా మొదలు కాలేదు కాబట్టి.. అధికారులు పేర్కొన్న బంగారం నిల్వలకంటే అవి ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఆంధ్ర స్థాయిలోనే తెలంగాణలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయి. యాదగిరి గుట్ట, భద్రాచలం, వేములవాడ రాజన్న ఆలయం భవిష్యత్తు కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పోటీ ఇచ్చిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు..” కొంతకాలంగా మనుషుల ప్రవర్తనలో మార్పు వచ్చింది. వారు ఆలయాల బాట పడుతున్నారు. ఆధ్యాత్మిక చింతనను కోరుకుంటున్నారు. ఇది మంచి పరిణామం. ఇలాంటి వాటి వల్ల మనుషుల్లో కాస్త సానుకూల దృక్పథం పెరుగుతుంది. అది అంతిమంగా మంచివైపుకు దారితీస్తుందని” ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు.