Telangana Congress: సుదీర్ఘకాలం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ.. అధికారంలోకి రావడానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది… 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. అయితే వీటిని అమలు చేసే క్రమంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది. నిధుల కొరత.. అనుకున్నంత స్థాయిలో ఆదాయం రాకపోవడంతో ప్రభుత్వం పథకాల అమలకు తీవ్ర కసరత్తు చేస్తున్నది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. నాయకులు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. అంతటి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఈ తలనొప్పి తప్పలేదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి దానికి అతీతుడు కాదు.. ఈ క్రమంలో సహజంగానే ఇంటిపోరు రేవంత్ రెడ్డికి ఎదురయింది. వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి అవ్వడమే పెద్ద టాస్క్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ రోజుల తరబడి కాలయాపన చేసిన తర్వాత రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. అయినప్పటికీ కొన్ని వర్గాలు రేవంత్ రెడ్డి కాళ్ళల్లో కట్టెపుల్లలు పెట్టడానికి ప్రయత్నించాయి. అయితే అత్యంత తెలివిగా రేవంత్ రెడ్డి వాటిని తిప్పి కొట్టారు. పాలనపై దృష్టి సారించారు. తనదైన మార్క్ నిర్ణయాలను ఒక్కొక్కటిగా తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా చెలరేగాయి. హైడ్రా, లగ చర్ల, గురుకులల్లో విద్యార్థుల మరణాలు వంటివి ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చాయి. వీటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా అడుగులు వేస్తున్న తరుణంలోనే.. సొంత పార్టీలో కుంపటి చెలరేగిందనే వార్తలు గుప్పు మన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి రాజకీయాలు కొత్త కాకపోయినప్పటికీ.. ఈ పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో..
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారట.. తమ నియోజకవర్గాలలో పనులు కాకపోవడంతో ఆ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రిని టార్గెట్ చేస్తూ వాళ్లు అంతర్గతంగా విమర్శలు చేశారట.. ఈ పదిమంది ఎమ్మెల్యేలపై నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయట. అయితే ఈ వ్యవహారాన్ని ఓ వర్గం మీడియా మాత్రమే గట్టిగా ప్రచారం చేస్తోంది. మరోవైపు ఈ భేటీకి వెళ్లారని ప్రచారం జరుగుతున్న ఓ ఎమ్మెల్యే హఠాత్తుగా విలేకరుల ముందుకు వచ్చారు. తను ఎలాంటి భేటికి వెళ్లలేదని… ఎన్నికల ప్రచారంలో ఉన్నానని.. ఇలాంటి ఆ బాండాలు ప్రసారం చేస్తే తీవ్ర చర్యలు హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మాత్రం ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా పరిశీలిస్తున్నది. ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణాలు ఏంటి? పనులు జరగడంలో ఎందుకు ఆలస్యం అవుతోంది? వంటి విషయాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యేలు భేటీ కావడాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పు పట్టకపోగా.. ఈ మాత్రం స్వేచ్ఛ తమ పార్టీలో ఎమ్మెల్యేలకు ఉందని.. తమపై విమర్శలు చేసే నాయకుల పార్టీలో ఇలా ఉంటుందా అని రివర్స్ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ఆ ఎమ్మెల్యేలు మెత్తబడ్డారని.. చర్చల తర్వాత సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది.