Telengana: ఆయన ఓ దళిత ఐఏఎస్ అధికారి. సుదీర్ఘ సర్వీస్ ఉన్నది.. పైగా తెలంగాణ బిడ్డ. తాను పనిచేసిన చోటల్లా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉద్యమంలోనూ తెర వెనుకా పని చేశారు.. రాష్ట్రం వచ్చిన తర్వాత కీలక పదవి లభించి, తెలంగాణ ప్రాంతానికి మరిన్ని సేవలు చేసే భాగ్యం దక్కుతుందని భావించారు. కానీ ఆయన కంటే తక్కువ అనుభవం ఉన్న వ్యక్తి .. బీహార్ మూలాలు ఉన్న వ్యక్తి.. ఆయనకు భాస్ అయ్యారు.. అది కూడా ఏపీ క్యాడర్ నుంచి. పైగా సదరు అధికారి అప్రాధాన్య పోస్టులోకి వెళ్లడంతో నారాజ్ గా ఉన్నారు. అది ఆ ఒక్క ఐఏఎస్ అధికారిది మాత్రమే కాదు… తెలంగాణ ప్రాంతానికి చెందిన అందరి పరిస్థితి దాదాపు అలానే ఉంది..
ఆయిన వారికి ఆకుల్లో..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు అయినవారికి ఆకుల్లో… కాని వారికి కంచాల్లో అన్నట్టుగా ఉంది.. ఒక రాష్ట్రానికి చెందిన అధికారులకు కీలక పోస్టులు ఇచ్చి వ్యవహారం నడుపుతోంది.. అంతేకాదు తెలంగాణకు చెందిన అధికారులను “నాన్ ఫోకల్” పాయింట్లలో చేస్తోంది.. సెక్రటేరియట్ లో మాత్రమే పని చేయిస్తున్నది. క్షేత్రస్థాయికి అసలు పంపడం లేదు. ఇదే అధికారుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధికారుల్లో ఆగ్రహం మరింత పెరిగిపోతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత తాము ఒక వెలుగు వెలిగిపోతామని భావించామని, కానీ ఇప్పుడు పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోతున్నామని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు తమ కేడర్ కు తగిన పోస్టులు లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. తమకంటే రిటైర్ అయిన అధికారుల పరిస్థితి మెరుగ్గా ఉందని వారు వాపోతున్నారు.

సీఎం ను కలిశారు
తెలంగాణ ఏర్పాటయిన తర్వాత రాష్ట్రానికి చెందిన కొంతమంది ఐఏఎస్ అధికారులు సీఎం కేసీఆర్ ను కలిశారు..ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.. దీంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులు చాలా ఆశలు పెంచుకున్నారు.. కానీ కెసిఆర్ ఇచ్చిన మాట అమల్లోకి రాలేదు . ఐఏఎస్ ల ఆశలు నెరవేరలేదు. రాష్ట్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన అధికారులకే కీలక స్థానాలు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఐఏఎస్ అధికారులను నాన్ ఫోకల్ పాయింట్లలో నియమిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రవాణా, రోడ్లు భవనాలు, పౌర సరఫరాలు, ఆర్థిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాంస్కృతిక, పర్యాటక, క్రీడలు, అడవులు, సాధారణ పరిపాలన తదితర శాఖలో కొంతమంది బడుగు బలహీన వర్గాల అధికారులను నాన్ ఫోకల్ పాయింట్లలో నియమించారు.. ఇతర ఉన్నతాధికారుల కింద వారు పనిచేయాల్సి వస్తున్నది. ఇంకా కొంతమందిని అ ప్రాధాన్యపు కార్యదర్శి పోస్టుల్లో నియమించి, వెలుగులోకి రానీయకుండా చేస్తున్నారని అసంతృప్తి కూడా ఉంది.. ఎప్పటికీ తనకు కీలక పదవి ఇవ్వడం లేదని ఆగ్రహంతో దళిత అధికారి స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేసుకొని, సర్వీస్ నుంచి వైదొలిగారు. అదే ఇతర వర్గాలకు చెందిన అధికారులకు మాత్రం కీలక పోస్టులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల కేడర్ కు చెందిన అధికారులను సైతం అందలం ఎక్కిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.. ఉన్నత వర్గానికి చెందిన అధికారి ఇటీవల పదవి విరమణ పొందారు.. అయితే ఆయన సర్వీస్ కు ఎక్స్ టెన్షన్ ఇచ్చి, అదే పదవిలో కొనసాగిస్తున్నారు.. వాస్తవానికి ఆ పదవికి అర్హులైన అధికారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల్లో చాలామంది ఉన్నారు. వారికి పదోన్నతులు కల్పించి ఉన్నతమైన పోస్టుల్లో నియమించవచ్చు కానీ అలా జరగడం లేదు.
విశ్రాంత అధికారులకు అందలం
ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పద్ధతి లేదంటూ ఐఏఎస్ లు మండిపడుతున్నారు. ఉన్న అధికారులకు సరైన పోస్టులు ఇవ్వలేని ప్రభుత్వం.. పదవి విరమణ పొందిన అధికారులకు మాత్రం కీలక పోస్టులు కట్టబెడుతోందని విమర్శిస్తున్నారు.. సీఎంవోలో పలువురు రిటైర్డ్ అధికారులు చక్రం తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వారికి అవి పర్మినెంట్ పోస్టులుగా మారిపోయాయని వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు.. కొంతమంది రిటైర్డ్ అధికారులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించి, ఖజానా పై భారం మోపుతున్న విమర్శలు కూడా ఉన్నాయి.. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించే ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కి ఇంటెలిజెన్స్ వంటి ప్రధాన బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
అందుకోసమేనా
కొంతమంది అధికారులను లూప్ లైన్ లో పెట్టేందుకు ప్రధాన కారణం.. వారు ప్రభుత్వ రహస్యాలు బయట పెడతారట.. నిజానికి ఇది వినేందుకు విడ్డూరంగా ఉంది. తెలంగాణ చెందిన అధికారులను కీలక పోస్టుల్లో నియమిస్తే అధికారిక సమాచారం బయటకు పోతుందన్నది సర్కారు భయమట.. పైగా ఇక్కడ మీడియా వారితో తెలంగాణ అధికారులకు సాన్నిహిత్యం ఉంటుందని, దాంతో అధికారిక సమాచారాన్ని వారితో పంచుకుంటారని జంకుతోందట.. అందుకే తెలంగాణ అధికారులను కీలక పోస్టుల్లో నియమించడం లేదని ఐఏఎస్ లాబీల్లో చర్చ జరుగుతున్నది. వాస్తవానికి ఐఏఎస్ లకు శిక్షణ సమయంలో “అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ “పై అవగాహన కల్పిస్తారు.. అందుకే కొన్ని విషయాల్లో పకడ్బందీగా వ్యవహరిస్తారు.. అలాంటివారు సమాచారం బయటకి ఎలా చెప్తారో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. ఇంతటి కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం గుణాత్మక మార్పు దేశాన్ని చూపిస్తామని చెప్పడం నిజంగా హాస్యాస్పదమే.