HomeతెలంగాణTelangana Smart Ration Card: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఇక క్యూఆర్ కోడ్...

Telangana Smart Ration Card: రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఇక క్యూఆర్ కోడ్ తో సరుకులు..

Telangana Smart Ration Card: రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే అర్హులందరికీ రేషన్ కార్డులు అందించిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని డిజిటలైజేషన్ చేసి స్మార్ట్ కార్డుల రూపంలో లబ్ధిదారులకు అందించనుంది. ఈ కార్డులపై క్యూఆర్ (QR) కోడ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగించి పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ స్మార్ట్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారంటే?

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటికే అన్ని జిల్లాలకు చేరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో జిల్లాల వారీగా పంపిణీ ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. డెబిట్ కార్డు మాదిరిగా రూపొందించిన ఈ స్మార్ట్ రేషన్ కార్డుపై కుటుంబ యజమాని ఫొటో, పేరు, పూర్తి చిరునామా ముద్రించబడింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలను కూడా కార్డుపై ముద్రించారు. కార్డు ఆకర్షణీయంగా, ఎక్కువకాలం మన్నేలా ప్లాస్టిక్ మెటీరియల్‌తో రూపొందించారు.

ఈ స్మార్ట్ రేషన్ కార్డులో ప్రధాన ఆకర్షణ క్యూఆర్ కోడ్. దీనిని మొబైల్‌తో స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ కార్డు సమాచారం, లబ్ధిదారుల జాబితా, ప్రతి నెల తీసుకున్న బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో రేషన్ పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

కొత్త కార్డులు చిన్న సైజులో ఉండటంతో పర్సులో లేదా జేబులో సులభంగా పెట్టుకుని తీసుకెళ్లే వీలుంటుంది. పేపర్ కార్డుల మాదిరిగా చిరిగిపోవడం, తడవడం లేదా పాడవడం వంటి సమస్యలు ఉండవు. డిజిటల్ సమాచారంతో కూడిన ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ సేవలను మరింత వేగంగా అందించేందుకు వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1.05 కోట్ల రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పొందుతున్నారు. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పూర్తయిన తర్వాత రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత ఆధునికంగా, పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త రేషన్ కార్డుల పంపిణీ తేదీని ప్రభుత్వం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశముంది. అనంతరం దశలవారీగా అన్ని అర్హులైన లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించనున్నట్లు తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version