Newspaper Advertising: ఇప్పటికే ఎలక్ట్రానిక్ మీడియా.. సోషల్ మీడియా.. డిజిటల్ మీడియా దున్నేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా సరే జస్ట్ క్షణంలోనే కళ్ళ ముందుకు తెస్తున్నాయి. దీనివల్ల ప్రింట్ మీడియాకు గిరాకీ తగ్గింది. కరోనా తర్వాత ప్రింట్ మీడియా పరిస్థితి దారుణంగా మారిపోయింది. మేనేజ్మెంట్లు దయ లేకుండా ఉద్యోగులను తొలగించాయి. పత్రికలలో పేజీల సంఖ్యను కుదించాయి. అంతేకాదు పత్రిక ధరను కూడా పెంచేశాయి.
ప్రకటనల కోసం పత్రికలు కొత్త ఎత్తు గడలకు పాల్పడుతున్నాయి. గతంలో మెయిన్ ఎడిషన్.. టాబ్లాయిడ్ ఎడిషన్ వేర్వేరుగా ఉండేవి. జోన్ పేజీలు కూడా ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పేజీల సంఖ్య తగ్గింది. టాబ్లాయిడ్ పరిమాణం పూర్తిగా కుంచించుకు పోయింది. అయితే ఇక్కడే మేనేజ్మెంట్ లు తెలివైన వ్యాపార నిర్ణయం తీసుకుంటున్నాయి. పత్రికలకు ఎంతో కీలకమైన మాస్టర్ హెడ్లను మార్చేస్తున్నాయి. యాడ్స్ ఎక్కువగా ఉంటే అన్ని ఫస్ట్ పేజీలను పబ్లిష్ చేస్తున్నాయి.
నీట్ మెడిసిన్ ర్యాంకుల సందర్భంగా.. ప్రకటనల ఆదాయాన్ని భారీగా దండికోవడానికి సాక్షి, ఈనాడు, జ్యోతి దర్జాగా వ్యాపారానికి శ్రీకారం చుట్టాయి. ఏకంగా ఆరేడు ఫస్ట్ పేజీలను కుమ్మి పడేశాయి. రెండు పేజీలు శ్రీ చైతన్యకు.. మరో రెండు పేజీలు నారాయణకు.. ఇంకా చిన్నా చితక కాలేజీలకు మిగతా పేజీలు కేటాయించాయి.. ఇటీవల కాలంలో యాడ్ టారిఫ్ లో ఈనాడు కాస్త రిబేట్ ఇస్తుంది. సాక్షి సంగతి తెలియదు. కాకపోతే ఆంధ్రజ్యోతి ఎటువంటి రిబెట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. తెలుగులో ఈ మూడే ప్రధాన పత్రికలుగా ఉన్న నేపథ్యంలో.. కార్పొరేట్ కాలేజీలు వీటికి మాత్రమే యాడ్స్ ఎక్కువగా ఇస్తున్నాయి. జాతీయ స్థాయి పరీక్షల ఫలితాల సమయంలో కాలేజీలు భారీగా ప్రకటనలు ఇస్తుంటాయి కాబట్టి.. పత్రికలు కూడా ఇష్టానుసారంగా మాస్టర్ హెడ్లను పక్కకు జరిపి.. పబ్లిష్ చేసుకుంటున్నాయి.
ఒకప్పుడు పత్రికల్లో ఇలా పరిస్థితి ఉండేది కాదు. మాస్టర్ హెడ్ ను పత్రికకు తలలాగా భావించేవారు. కనీసం ఎటువైపు కూడా జరగనిచ్చేవారు కాదు. కొంతకాలం పాటు ఈనాడు ఈ విధానాన్ని సాగించింది. ఇప్పుడు ఈనాడు కూడా గుంపుల గోవిందం లాగా మారిపోయింది. యాడ్ రెవెన్యూ కోసం చివరికి మాస్టర్ హెడ్ ని కూడా పక్కకు తప్పుకు అన్నట్టుగా జరుపుతోంది. ఏదైనా కోట్ల వ్యాపారం.. భారీగా డబ్బు వస్తుంటే మాస్టర్ హెడ్ ది ఏముంది.. జరిపితే జరిగిపోతుంది కదా..
