Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 40 ఏళ్లు దాటిన ఉద్యోగులు, పెన్షనర్లకు ఏడాదికి ఒకసారి ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ అందుబాటులోకి వచ్చింది.
ఎన్‌ఈహెచ్‌ఎస్ ముఖ్యాంశాలు..
ఈ పథకం ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది. ఔట్ పేషెంట్ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తెచ్చారు. ల్యాబ్ పరీక్షలు ఓపీ సేవలపై 50 శాతం రాయితీ కల్పించడం వల్ల సాధారణ ఆరోగ్య సమస్యలకు తక్కువ ఖర్చుతో చికిత్స పొందవచ్చు.
40 ఏళ్లు దాటినవారికి ప్రయోజనం
40 ఏళ్లు పైబడిన ఉద్యోగులు, పెన్షనర్లకు ఏడాదికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ పూర్తిగా ఉచితం. ఈ చెకప్‌లో రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ, లివర్ వంటి ముఖ్యమైన పరీక్షలు ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఉచిత చెకప్ ద్వారా ముందుగానే సమస్యలు గుర్తించి, తగిన చికిత్స తీసుకోవడం సాధ్యమవుతుంది.
ఆర్థిక సహకారం ఇలా..
ఈ పథకం ఆర్థికంగా స్థిరంగా నడిచేలా ఉమ్మడి సహకార విధానం అమలు చేశారు. ఉద్యోగి తన బేసిక్ పేలో 1.5 శాతం మొత్తం చెల్లించాలి. అదే మొత్తాన్ని ప్రభుత్వం కూడా అందజేస్తుంది. ఇది పథకాన్ని స్వీయ–నిర్వహణ సాధ్యం చేస్తుంది. పెన్షనర్లకు కూడా ఇదే విధంగా వర్తిస్తుంది. 40 ఏళ్లు దాటిన తర్వాత ఉచిత మాస్టర్ చెకప్ అందించడం ద్వారా హార్ట్ అటాక్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే నియంత్రించవచ్చు. అయితే, పథకం విజయవంతం కావాలంటే అవగాహన పెంచడం, ఆసుపత్రుల నెట్‌వర్క్ విస్తరించడం, డిజిటల్ ప్రక్రియలు సులభతరం చేయడం అవసరం.
ఇలా ప్రయోజనం పొందాలి..
అధికారిక వెబ్‌సైట్ ద్వారా డిజిటల్ హెల్త్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. నిర్దేశిత ఆసుపత్రుల్లో చెకప్ లేదా చికిత్సకు వెళ్లవచ్చు. ఓపీ సేవలు, ల్యాబ్ టెస్టులకు 50 శాతం రాయితీ వర్తిస్తుంది. 40 ఏళ్లు దాటినవారు ఏడాదికి ఒకసారి ఉచిత మాస్టర్ చెకప్‌కు అర్హులు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్యాన్ని రక్షించడంలో మైలురాయి. ఆరోగ్యం ఉంటేనే సంతోషకరమైన జీవితం, ఉత్పాదకత సాధ్యం. ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.


