Telangana Minister: తెలంగాణ రాష్ట్రంలో ఆ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు ఇటీవల కాలంలో వివాదాస్పదమవుతున్నాయి. ఆ మంత్రి గారికి ఉన్నవి రెండు శాఖలు మాత్రమే అయినప్పటికీ.. వాటిలో తీసుకుంటున్న నిర్ణయాలు అనేకసార్లు వివాదాలుగా మారుతున్నాయి. ఆ మంత్రి గారికి హై కమాండ్ వద్ద గట్టి పట్టు ఉండడంతో ముఖ్యమంత్రి సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అంతేకాదు నోటిమీద పట్టు లేకపోవడంతో అడ్డగోలుగా మాట్లాడేస్తుంటారని ఆరోపణలు ఆ మంత్రి గారి మీద ఎప్పటినుంచో ఉన్నాయి. పైగా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వ విధానాలలో వేలు పెట్టడం వల్ల నిత్యం వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇసుక వ్యవహారంలో మంత్రి అనుచరుడు ఫోన్ చేసి బెదిరింపులకు గురి చేశారు. దీంతో ఇసుక కాంట్రాక్టర్లు ఏకంగా సమావేశం పెట్టి.. తమకు ఎదురవుతున్న అనుభవాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మంత్రి అనుచరులు సాగిస్తున్న దందాలు మామూలువికావు.
ఆ మంత్రి పర్యవేక్షించే రెండు శాఖలలో.. ఒక శాఖలో ఓ ప్రైవేట్ పిఎ వేలు పెట్టాడు. ఏకంగా మంత్రి లెవెల్ లోనే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ శాఖ పరిధిలోకి వచ్చే వ్యక్తులను బెదిరించడం.. డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మార్చుకున్నాడు. ఏమైనా అంటే మంత్రిగారి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అంతేకాదు తనను ఎవరు ఏమి చేయలేరని.. ఇదంతా మంత్రిగారు చెబితేనే చేస్తున్నానని అతడు అంటున్నాడు. అతడికి కప్పం కట్టుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. తమ గోడును ఎవరు ఆలకిస్తారంటూ ఆవేదన చెందుతున్నారు.
వాస్తవానికి ప్రైవేట్ పీఏకు ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ ప్రైవేట్ పీఏ మాత్రం మంత్రిగారి అండతో రెచ్చిపోతున్నాడు. అందిన కాడికి దండుకొని చూస్తుండగానే ఎదిగిపోతున్నాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ఆస్తులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల తరచూ విదేశాలకు కూడా వెళ్తున్నట్టు సమాచారం. ఈ మంత్రిగారి పీఏ పై ఆరోపణలు తీవ్రస్థాయిలో రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇంటలిజెన్స్ ను రంగంలోకి దింపింది. అయితే ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ జరపడంతో అది నిజమేనని తేలింది. దీంతో ఆ మంత్రి గారికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వెళ్ళిందని.. ఎందుకైనా మంచిది ఆ ప్రైవేట్ పీఏ ను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. మరి ఇప్పటికైనా ఆ మంత్రి గారు ఆ పీఏ ను తొలగిస్తారా? లేక అలానే విధులలో కొనసాగిస్తారా? అనేది చూడాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఆ మంత్రి గారి బంధువు ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రిగారి ఖర్చులకు మొత్తం తానే డబ్బులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆయన మాట్లాడింది అలా ఉంటే.. మంత్రిగారి పిఏ చేస్తున్న వ్యవహారం మరో విధంగా ఉంది. అంటే దీనిని బట్టి జనాల మైండ్ డైవర్ట్ చేయడానికి ఆ మంత్రి గారి కుటుంబ సభ్యులు నాటకమాడుతున్నారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.