Kerala: మనుషుల్లో రోజురోజుకు విచక్షణ అనేది తగ్గిపోతోంది.. దాని స్థానంలో కోపం, ప్రతీకారం, అసూయ, త్వరిత అసహనం వంటివి పెరిగిపోతున్నాయి. అవి పెరిగిపోయిన క్రమంలో మనుషులు దారుణాతీ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇది కూడా అటువంటి దారుణమే. కాకపోతే ఆ దారుణానికి పాల్పడిన వ్యక్తి ఏకంగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకున్నాడు. అటువంటి పనికి సామాజిక మాధ్యమాలను వినియోగించడం బహుశా మనదేశంలోనే ఇదే తొలిసారి కావచ్చు.
అతని పేరు ఇసాక్. వయసు దాదాపు 42 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉండేది కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా వలక్కోడు. ఇతడికి వివాహం జరిగింది. ఇసాక్ భార్య పేరు శాలిని. ఆమెకు దాదాపు 39 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇసాక్, శాలిని మొదట్లో బాగానే ఉండేవారు. వీరికి సంతానం కలిగిందో? లేదో? తెలియదు. కాకపోతే శాలిని చుట్టుపక్కల వారితో బాగుంటుంది. చలాకీగా ఉంటుంది. అది ఇసాక్ కు ఏమాత్రం నచ్చేది కాదు. అనేక సందర్భాల్లో ఆ పద్ధతిని మార్చుకోమని చెప్పేవాడు. కానీ శాలిని అలానే ఉండేది. పైగా అప్పుడప్పుడు తన స్నేహితులను కూడా ఇంటికి రమ్మని చెప్పేది. దీంతో ఇసాక్ ఆమె మీద కోపం పెంచుకున్నాడు. తనకు తెలియకుండా వేరే వారితో సంబంధం నడుపుతుందేమోననే అనుమానాన్ని పెంచుకున్నాడు. దీంతో నిత్యం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇటీవల దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు తారస్థాయికి చేరుకున్నాయి.
ఇక ఇటీవల శాలిని తో ఇసాక్ గొడవపడ్డాడు. ఆ గొడవలో ఇష్టానుసారంగా తిట్టాడు. ఒకానొక దశలో విచక్షణ కోల్పోయి అత్యంత పదునైన ఆయుధంతో శాలిని పొడిచి హత్య చేశాడు. ఆమె చనిపోయిన తర్వాత ప్రాణ భయంతో బయటికి పరుగులు పెట్టాడు. అనంతరం ఫేస్బుక్ లైవ్ లో తన భార్యను చంపినట్టు ఒప్పుకున్నాడు. తాను ఒక రబ్బరు తోటలో పనిచేస్తున్నానని.. తన భార్య ప్రవర్తన మీద అనుమానం కలిగి హత్య చేశానని.. నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని అతడు ఫేస్బుక్ లో లైవ్ అనే ఆప్షన్ ఆన్ చేసి.. అందులో పేర్కొనడం విశేషం. వాస్తవానికి ఇంతవరకు మనదేశంలో భర్తలను భార్యలు, భార్యలను భర్తను చంపిన సంఘటనలు వెలుగు చూసినప్పటికీ.. లైవ్ లో తాను చేసిన దారుణం గురించి ఒక భర్త వెల్లడించడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు.