Telangana media war: వార్తలను వార్తలలాగా ప్రచురించాలి. కథనాలను కథనాల మాదిరిగా ప్రసారం చేయాలి. అంతే తప్ప సొంత విశ్లేషణకు తావు ఉండకూడదు. సొంతంగా విశ్లేషణ చేస్తే ఏక పక్షంగా కాకుండా.. రెండు పక్షాలలో చేయాలి. అంతే తప్ప వాక్ స్వాతంత్ర్యం పేరుతో అడ్డగోలుగా రాతలు రాస్తే.. వార్త కథనాలను ప్రసారం చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఆ తర్వాత సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిని “మహా” ఎదుర్కొంటున్నది.
వాస్తవానికి తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో “మహా” కు అంతగా ఆదరణ ఉండదు. దీని స్థానం ఎక్కడో చివరి వరుసలో ఉంటుంది. ఒకరకంగా ఇది యూట్యూబ్ ఛానల్ కు ఎక్కువ, న్యూస్ ఛానల్ కు తక్కువ. అయితే ఇటీవల ఈ ఛానల్ ప్రసారం చేసిన కథనాలు బీ గ్రేడ్ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కల్వకుంట్ల తారకరామారావును ఉద్దేశించి ప్రసారం చేసిన కథనాలు అడ్డగోలుగా ఉన్నాయి.. వాటికోసం ఉపయోగించిన థంబ్ నెయిల్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి. అవి సహజంగానే భారత రాష్ట్ర సమితి నాయకులకు ఇబ్బంది కలిగించాయి. దీంతో వారు రంగంలోకి దిగి ఏకంగా “మహా” కార్యాలయంపై దాడి చేశారు.
Also read: హరీష్ రావు, కేటీఆర్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ఈ దాడి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. “మహా” కార్యాలయాన్ని తెలంగాణ మంత్రులు సందర్శించారు. ఇక “మహా” అధిపతి వంశీ తనకు కల్వకుంట్ల తారక రామారావు సారీ చెప్పాలన్నారు. ఇక ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి నాయకులు ఒకడుగు ముందుకు వేసి మీడియాకు ప్రాంతాలను ఆపాదించే ప్రయత్నం చేశారు. తెలంగాణ మీడియా, సీమాంధ్ర మీడియా అంటూ విభజన రేఖ గీశారు. అంతేకాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి భారత రాష్ట్ర సమితి నాయకులు అదే ధోరణిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే నాయకులు చేస్తున్న విమర్శలు పరిధి దాటిపోతున్నాయి. ఏకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ భారత రాష్ట్ర సమితి నాయకులు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చేస్తున్నారు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. ఏకంగా వ్యక్తిగత దాడులకు తాము సిద్దమని హెచ్చరికలు పంపుతున్నారు. ఈసారి కచ్చితంగా దాడులు చేస్తామని చెబుతున్నారు.
భారత రాష్ట్ర సమితి నాయకులు దాడి చేసిన నేపథ్యంలో మహా యాజమాన్యం ఒక్కసారిగా దిద్దుబాటు చర్యలకు దిగింది. కల్వకుంట్ల తారక రామారావు పై ప్రసారం చేసిన కథనాలకు ఉపయోగించిన థంబ్ నెయిల్స్ మొత్తం మార్చేసింది.. ఇదే విషయాన్ని భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేయడం మొదలు పెట్టింది. బడితే పూజ చేస్తే అన్ని సెట్ అయిపోయాయని.. మహా యాజమాన్యానికి బుద్ధి వచ్చిందని సోషల్ మీడియాలో పేర్కొంది.. ఇక ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ నెటిజన్లు మీమ్స్ రూపొందిస్తున్నారు. అవి సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.