BRS : మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ లో భాగంగా మూసీ నదిలో ఆక్రమణల తొలగింపు వ్యవహారంపై రాజకీయం రాజుకుంది. రాజధానిలో చెరువులు, నాళాల ఆక్రమణల తొలగింపు కోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఆపరేషన్ విషయంలో మిన్నకున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ , మూసీ ఆక్రమణల తొలగింపులో ప్రభుత్వంపై పోరు ప్రకటించింది. మూసీ ఆక్రమణలలో పేదలు, బలహీనవర్గాలవారే ఎక్కువగా ఉండడం, వారంతా ఆక్రమణల తొలగింపునకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుండడంతో బీఆర్ఎస్ వారి పక్షాన నిలిచేందుకు సిద్దమవడం, పౌర సమాజం నుంచి , మీడియా నుంచి కూడా మూసీ ఆక్రమణల తొలగింపులో ప్రభుత్వం మరింత సంయమనంతో వ్యవహరించాలనే సూచనలు వస్తుండడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
మూసీ గర్భంలో ఎనిమిది వేల పైచిలుకు ఇళ్ళు:
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలో మూసీ నది గర్భంలో 8,500 పైచిలుకు అక్రమ నిర్మాణాలు గుర్తించారు. వీటిలో 1032 నిర్మాణాలే భారీ కట్టడాలు అయితే మిగిలినవి అన్నీ చిన్న, చిన్న నిర్మాణాలు. నదికి సరిహద్దుల నుంచి ఇరువైపులా 50 మీటర్ల పరిధిని బఫర్ జోన్ గా గుర్తించారు. నదీ గర్భాన్ని ఎఫ్.టీ.ఎల్. పరిధిగా నిర్ధారించారు. తొలుత ఎఫ్.టీ.ఎల్. పరిధిలో అక్రమ కట్టడాలను, ఆతర్వాత బఫర్ జోన్ లోని నిర్మాణాలని తొలగించాలని నిర్ణయించారు. ఇక్కడ నిర్మాణాలు కోల్పోయిన వారందరికీ డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఉపాధి, పిల్లలకు విద్యా సదుపాయాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. పట్టా భూములు, స్థలాలను కోల్పోయేవారికి చట్టబద్ధంగా పరిహారం కూడా ఇస్తామని పేర్కొంటున్నారు. అయితే దశాబ్దాలుగా, తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్నామని ఉన్న పళంగా ఖాళీ చేయిస్తే తమ బతుకేం కావాలని నిర్వాసితులు ఆందోళన చేపట్టారు.
మూసీ నిర్వాసితులలో ప్రభుత్వ వ్యతిరేకతని సొమ్ము చేసుకున్న బీఆర్ఎస్:
మూసీ నిర్వాసితులకు అండగా ఉండడం ద్వారా వారిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే ప్లాన్ లో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. కూల్చివేతల అంశంలో ఏ స్టాండ్ తీసుకోవాలో తేల్చుకోలేక బీజేపీ , నిర్వాసితుల పట్ల సానుభూతి వున్నా బయటకు వచ్చి మద్దతివ్వలేని స్థితిలో ఎం.ఐ.ఎం. నిర్వాసితులలో స్థానం దక్కించుకోలేకపోయాయి. ఈ పరిణామాలతో మూసీ ప్రాజెక్టుపై మొదలైన రాజకీయ క్రీడ మున్ముందు మరింత వేడిగా సాగనుంది.