Telangana High Court : ఇటీవల అమీన్పూర్ ప్రాంతంలో ఓ భవనాన్ని హైడ్రా పడగొట్టింది. అంతకుముందు 48 గంటలోనే ఖాళీ చేయాలని నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చిన సమయం వరకు వేచి ఉండకుండా పడగొట్టింది. ఈ విషయంపై ఆ భవనం యజమాని హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా తన భవనాన్ని సమయం లోపే పడగొట్టిందని అందులో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు స్పందించి.. విచారణకు రావాలని కమిషనర్ రంగనాథ్ ను ఆదేశించింది. సోమవారం దానికి సంబంధించిన విచారణ జరిగింది. విక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హైకోర్టు విచారణకు హాజరయ్యారు. అమీన్పూర్ ప్రాంతంలో ఆ భవనాన్ని పడగొట్టిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన తహసిల్దార్ కూల్చివేతలపై హైకోర్టుకు వివరణ ఇచ్చారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. శని, ఆదివారాలలో ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారని.. సూర్యాస్తమయం తర్వాత ఎందుకు పడగొడుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. “సెలవుల్లో నోటీసులు ఇస్తున్నారు. అత్యవసరంగా భవనాలను కూల్చివేస్తున్నారు. ఖాళీ చేయకపోతే అత్యవసరంగా పడగొట్టాల్సిన అవసరం ఏముంది. శని, ఆదివారాలలో నిర్మాణాలను పడగొట్టొద్దు. గతంలో కోర్టు తీర్పులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఆ విషయం కూడా మీకు తెలియదా? చట్ట విరుద్ధంగా పనిచేయొద్దు. ఇల్లు పడగొట్టే ముందు యజమానికి సమాచారం అందించాలి. కనీసం చివరి అవకాశం అయినా ఇవ్వాలి.. చనిపోయే ముందు ఒక వ్యక్తిని చివరి కోరిక అడుగుతారు.. అలాంటిది కూడా మీరు పాటించడం లేదు. పైన ఉన్న బాస్ లను సంతృప్తి పరిచేందుకు మీరు పని చేయొద్దు.. అసలు ఆదివారం మీరు పని చేయాల్సిన అవసరం ఏముందని” హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
చట్ట వ్యతిరేకంగా పనిచేస్తారా?
హైడ్రా పని తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది..” ఆదివారం మీరు ఎందుకు పని చేయాలి? అలా పనిచేయకూడదు కదా? చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే మీరు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది.. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో పేదలను ఇబ్బందులకు ఎందుకు గురిచేస్తారు? కూల్చివేతలు ఆదివారం చేపట్టడం సరైన చర్య కాదు కదా? అది హైకోర్టు తీర్పునకు వ్యతిరేకం కదా? అమీన్పూర్ పైనే మీరు మాట్లాడాలి.. కావూరి హిల్స్ గురించి మేము స్పందించడం లేదు కదా.. విషయాన్ని పక్కదారి పట్టించవద్దు.. ఎమ్మార్వో అడిగితే గుడ్డిగా ఎలా చర్యలు తీసుకుంటారు.. ఒకవేళ ఎమ్మార్వో అడిగితే చార్మినార్, హై కోర్టును కూడా పడగొడతారా” అంటూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.. మేం చెప్పినా కూడా వినకుండా హైడ్రా ఇదే తీరుగా ముందుకు వెళ్తే స్టే లు ఇవ్వాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇదే క్రమంలో రంగనాథ్ తన స్పందనను తెలియజేశారు.. తమ కోర్టులను గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. ఇదే సమయంలో మూసీ నదిపై కూడా 20 లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని న్యాయమూర్తి ఈ సందర్భంగా చెప్పడం విశేషం.