Jagtial extreme heatwave: తెలంగాణ వారం రోజులుగా నిప్పుల కొలిమిలా మారింది. మే ప్రారంభం నుంచి భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఉదయం 9 గంటల నుంచే వేడి సెగలు మొదలవుతున్నాయి. మధ్యాహ్నానికి మంటలు పుట్టిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు వేడి తీవ్రత కొనసాగుతోంది. దీంతో మూగజీవాలు అల్లాడుతున్నాయి. పంట పొలాల్లో అగ్గి రాజుకుంటోంది. ఇక మనుషులు అల్లాడిపోతున్నారు. ఎండకు తోడు వేడి గాలులు వీస్తుండడంతో వడదెబ్బబారిన పడుతున్నారు.
కరీంనగర్ నిప్పుల కుంపటి..
భానుడి భగభగలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం నిప్పుల కొలిమిలా మారింది. సోమవారం జగిత్యాల జిల్లా గుల్లకోటలో 45.7 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవగా, అల్లీపూర్‌లో 45.3 డిగ్రీలుగా నమోదైంది. ఈ తీవ్రమైన వేడిమి ప్రజల జీవనశైలిని అతలాకుతలం చేస్తోంది.
రెడ్ జోన్‌లో ఉమ్మడి జిల్లా..
కేవలం జగిత్యాల జిల్లాలోనే కాకుండా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేశాయి. రాజన్న సిరిసిల్ల మర్థనపేటలో 44.7 డిగ్రీలు, పెద్దూరులో 43.4 డిగ్రీలుగా నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లి, ఎలిగేడు ప్రాంతాల్లో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా గుండిలో 44.2 డిగ్రీలు, జమ్మికుంటలో 44.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
అప్రమత్తంగా ఉంటాలని హెచ్చరిక..
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రానున్న రోజుల్లోనూ ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున, ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, తగినంత నీరు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరిస్తోంది.