Telangana Job Calendar : తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల.. శాఖలవారీగా షెడ్యూల్‌.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఉద్యోగాల భర్తీలో తీవ్ర జాప్యం చేసింది. ఫలితంగా 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

Written By: Raj Shekar, Updated On : August 2, 2024 8:02 pm
Follow us on

Telangana Job Calendar : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు చేస్తున్నారు. తాజాగా నిరుద్యోగుల సమస్య పరిష్కరించేందుకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తారని భావించారు. కానీ, అసెంబ్లీ సమావేశాల చివరి రోజు(ఆగస్టు 2న) డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టివిక్రమార్ల అసెంబ్లీలో ప్రకటించారు. నిరుద్యోగులకు న్యాయం చేయడంలో భాగంగా టీజీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దయిందని తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను గందరగోళంగా మార్చారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ ఐఏఎస్‌లతో రెండు కమిటీలు ఏర్పాటు చేసి, వారి సూచనల్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి, మొత్తం 563 పోస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్ష సజావుగా నిర్వహించి ఫలితాలు ప్రకటించామన్నారు. హాస్టల్‌ వెల్ఫేర్‌ పరీక్ష, డివిజన్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పరీక్షలను కూడా నిర్వహించామని తెలిపారు. ఇప్పటికే 32,410 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించారు. 13,500 ఉద్యోగ ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చామన్నారు. 11,062 ఖాళీలతో టీచర్ రిక్రూట్మెంట్ కోసం డీఎస్సీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నటు‍్ల పేర్కొన్నారు. 465 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీల భర్తీకి, ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ లో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్-2ను డిసెంబరులో, గ్రూప్-3 నవంబరులో నిర్వహించనున్నారు.

జాబ్‌ క్యాలెండర్‌ ఇలా..

– వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్ లో నోటిఫికేషన్ విడుదల… నవంబర్లో పరీక్షలు.

– ట్రాన్స్‌కోలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్లో నోటిఫికేషన్.. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు.

– నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్‌ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు జరుగుతాయి.

– వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్లో పరీక్షలు జరుగుతాయి.

– వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.

– ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్.. మేలో పరీక్షలు నిర్వహిస్తారు.

– గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షను వచ్చే ఏడాది జులైలో నిర్వహిస్తారు.

– పోలీస్‌ కానిస్టేబుళ్లు, ఎస్సై పోస్టుల భర్తీ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తారు. ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు.

– డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్ లో నోటిఫికేషన్.. సెప్టెంబర్‌లో పరీక్షలు.

– వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు2 నోటిఫికేషన్.. అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.

– గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీకి వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్ ఇస్తారు. నవంబర్లో పరీక్షలు జరుగుతాయి.

– సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్‌.. నవంబర్‌లో పరీక్షలు.