Telangana Electricity Demand February 2026: మార్చి నెల ఇంకా మొదలుకాకముందే ఎండలు ఉద్ధృతం అవుతున్నాయి. భానుడి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఈ ప్రభావం తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీ ఎన్పీడీసీఎల్) పరిధిలో స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: తిరుమలేషుడి భక్తుల కోసం టీటీడీ సంచలన నిర్ణయాలు
శనివారం ఒక్కరోజే 6,057 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదవడం విశేషం. ఫిబ్రవరి నెలలోనే ఇంత అధిక వినియోగం నమోదవడం ఇదే తొలిసారి అని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గత ఏడాది మార్చి 11న నమోదైన 5,816 మెగావాట్ల రికార్డును ఈసారి ఫిబ్రవరిలోనే అధిగమించడం గమనార్హమని పేర్కొన్నారు.
వేసవి తీవ్రత పెరిగే ముందు నుంచే విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి సంస్థ చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 35 కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు 366 అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లను అమర్చినట్లు వెల్లడించారు. అదనంగా 7,600 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచి, ఓవర్‌లోడ్ ఉన్న 33 కేవీ 8 ఫీడర్లను విభజించినట్లు చెప్పారు.
ఇక 1,200 కిలోమీటర్ల మేర ప్రత్యామ్నాయ లైన్లు నిర్మించడం, తక్కువ వోల్టేజ్ సమస్యను తగ్గించేందుకు 392 కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకున్నామని వివరించారు.
వేసవిలో మరింత పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఎన్పీడీసీఎల్ పూర్తిగా సిద్ధంగా ఉందని సీఎండీ స్పష్టం చేశారు.