Telangana Congress Party : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరుసగా మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారంలోకి రాకముందే కాళేశ్వరం కుంగింది. దీంతో అవినీతిపై కమిషన్ విచారణ జరుపుతోంది. తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేస్ కేసుపై సీఐడీ విచారణ జరుపుతోంది. తాజాగా ఫాల్కన్ గ్రూప్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగుచూసింది.
తెలంగాణ సీఐడీ ఫాల్కన్ గ్రూప్‌కు చెందిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) ఆర్యన్ సింగ్‌ను రూ.4,215 కోట్ల మోసం కేసులో అరెస్ట్ చేసింది. ఫాల్కన్ గ్రూప్, దాని అనుబంధ సంస్థ అయిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల(గూగుల్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్), టెలీకాలర్ల ద్వారా ప్రకటనలు చేసింది. ప్రముఖ బహుళజాతి సంస్థల పేరుతో నకిలీ ఒప్పందాలను సృష్టించి, అధిక వడ్డీ రేట్లతో ఆకర్షణీయమైన స్వల్పకాలిక పథకాలను ప్రచారం చేసింది. ఈ విధంగా 7,056 మంది డిపాజిటర్ల నుంచి రూ.4,215 కోట్లు సేకరించింది. వీరిలో 4,065 మందిని రూ.792 కోట్ల మేరకు మోసం చేసింది.
Also Read: హరిహర వీరమల్లు మీద నెగెటివ్ ప్రచారం చేస్తుందేవరు..?
ఆర్యన్ సింగ్ కీలక పాత్ర
ఆర్యన్ సింగ్, ఈ కేసులో ఐదో నిందితుడిగా గుర్తించబడ్డాడు. అతను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్ దీప్ కుమార్‌తో కలిసి పనిచేస్తూ, డిపాజిటర్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్యన్ సింగ్ ఈ మోసానికి ముఖ్య వ్యక్తిగా ఉన్నాడని, బాధితులతో నేరుగా సంప్రదించి రసీదులు జారీ చేసినట్లు సీఐడీ తెలిపింది. అతను రూ. 14.35 కోట్ల వ్యూహాత్మక డిపాజిట్లను సేకరించి, రూ.1.62 కోట్లను తన ఖాతాకు మళ్లించుకున్నట్లు సీఐడీ గుర్తించింది.
చట్టపరమైన చర్యలు
జులై 4న పంజాబ్‌లోని బతిండాలో ఆర్యన్ సింగ్‌ను తెలంగాణ సీఐడీ అరెస్ట్ చేసింది. నేరం బయటపడిన వెంటనే అతను నాందేడ్‌కు, ఆ తర్వాత బతిండాలోని ఒక గురుద్వారాలో ఆశ్రయం పొందాడు. సీఐడీ బృందం అతన్ని అక్కడి నుంచి అదుపులోకి తీసుకుంది. రెండు సెల్ ఫోన్లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఆర్యన్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి, ఆదివారం మేజిస్ట్రేట్ ముందు జ్యుడీషియల్ రిమాండ్‌కు హాజరుపరిచారు. ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు, మిగిలిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. ఫాల్కన్ గ్రూప్, దాని డైరెక్టర్లపై దేశవ్యాప్తంగా ఎనిమిది ఇతర కేసులు నమోదయ్యాయి.