BJP Manifesto
BJP Manifesto: మొన్నటిదాకా తెలంగాణ లో రెండవ స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా తన గ్రాఫ్ కోల్పోయింది. కీలకమైన నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అధిష్టానం పనితీరును నిరసిస్తూ కొంతమంది నాయకులు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇలాంటి పరిస్థితి పార్టీకి మంచిది కాదనుకున్నారో ఏమో తెలియదు గానీ ఢిల్లీ పెద్దలు తెలంగాణపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ మధ్య తెలంగాణ రాష్ట్రంలో వరుసగా పర్యటనలు జరిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా పర్యటించారు. ఇటీవల నిర్వహించిన మాదిగల విశ్వరూప సభలో దళితుల ఏ,బి,సి,డి వర్గీకరణకు మోడీ పచ్చ జెండా ఊపడంతో ఒక్కసారిగా బిజెపిలో ఆశలు పెరిగాయి. అయితే ఇవి తమకు లాభం కలిగిస్తాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. సానుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన సీట్లు సాధించాలని బిజెపి నాయకులు యోచిస్తున్నారు.. ఇందులో భాగంగానే ప్రజారంజకంగా ఎన్నికల మేనిఫెస్టో రూపొందించినట్టు తెలుస్తోంది.
ఏమేమి ఉన్నాయి అంటే
ఈ ఎన్నికల్లో కూడా బిజెపి మోడీ బొమ్మనే నమ్ముకున్నది. మోడీ గ్యారెంటీ నినాదంతో ఈ మేనిఫెస్టో రూపొందించింది. నారీ శక్తి పేరుతో ప్రతి వివాహితకు ఏడాదికి 12,000 చొప్పున ఇస్తామని హామీ ఇవ్వబోతోంది. 500 కే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని ప్రకటించబోతోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి రుణమాఫీకి అనుగుణంగా వడ్డీ మాఫీని ప్రకటించనుంది. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం రైతులకు సంబంధించి లక్ష రూపాయల రుణమాఫీని ఆలస్యంగా ప్రకటించినప్పటికీ కొంతమేర రైతులపై వడ్డీ భారం ఇంకా అలానే ఉంది. అయితే ఆ మొత్తాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని బిజెపి హామీ ఇవ్వనుంది.. కాలు రైతులకు కూడా ప్రయోజనం చేకూర్చే విధంగా ఆర్థిక వెసలు బాటు కల్పించనుంది.. యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్, అందరికీ ఉచిత వైద్యం, విద్య అందించనుంది. ఆయుష్మాన్ భారత్ కింద పది లక్షల వరకు ఉచిత వైద్యం, జన ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది.
నేడు అమిత్ షా రాక, 19న జేపీ నడ్డా..
ఇక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం రాత్రి హైదరాబాద్ వస్తున్నారు. శనివారం ఆయన బిజెపి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు గద్వాల, 12 గంటలకు నల్లగొండ, మధ్యాహ్నం రెండు గంటలకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కోట ప్రాంతంలో నిర్వహించే సకలజనుల విజయసంకల్ప బహిరంగ సభలకు ఆయన హాజరవుతారు. అంతేకాకుండా పార్టీ ముఖ్యులతో, ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. అందరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఇక బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 19వ తారీకు హైదరాబాద్ వస్తారు. చేవెళ్ల, నారాయణపేట ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. మల్కాజ్గిరి నియోజకవర్గం లో నిర్వహించే రోడ్ షో లో పాల్గొంటారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈనెల 25 నుంచి 27 వరకు ఎన్నికల ప్రచార సభలో పాల్గొనే అవకాశం ఉందని బిజెపి వర్గాలు అంటున్నాయి. ఆయన కరీంనగర్ తో పాటు నిర్మల్, రామాయంపేటలో జరిగే బహిరంగ సభలకు హాజరవుతారు.