Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh Padayatra: లోకేష్ కు ఏమైంది? పాదయాత్ర లేనట్టేనా?

Nara Lokesh Padayatra: లోకేష్ కు ఏమైంది? పాదయాత్ర లేనట్టేనా?

Nara Lokesh Padayatra: నారా లోకేష్ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారు? అసలు యువగళం తిరిగి మొదలవుతుందా? లేదా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ 10న లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. కానీ ఇంతవరకు లోకేష్ పాదయాత్రను తిరిగి ప్రారంభించలేదు. దీంతో పాదయాత్ర ప్రారంభించే ఉద్దేశం ఉందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది.

ఈ ఏడాది జనవరి 27న కుప్పంలో లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. రాయలసీమలో సక్సెస్ ఫుల్ గా పాదయాత్రను పూర్తి చేశారు. ప్రారంభంలో వైసీపీ నేతల నుంచి ఇబ్బందులు ఎదురైనా.. అధిగమించి పూర్తి చేయగలిగారు. కోస్తాలో అడుగుపెట్టారు. అక్కడ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. సరిగ్గా పశ్చిమగోదావరి జిల్లా శివారుకు వెళుతున్న తరుణంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. అప్పటినుంచి పాదయాత్ర నిలిపివేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నంతకాలం న్యాయ నిపుణులతో చర్చలు అంటూ ఢిల్లీలో కాలం గడిపారు. మధ్యలో ఒకసారి వచ్చి పాదయాత్ర షెడ్యూల్ ను సైతం ప్రకటించారు. సీనియర్లు వారించడంతో తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు బయటకు వచ్చిన పాదయాత్ర చేసేందుకు మొగ్గు చూపకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

అసలు లోకేష్ కు ఏమైంది? ఎందుకు పాదయాత్ర ప్రారంభించడం లేదు? అన్న చర్చ టిడిపి శ్రేణుల నుంచి వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం పార్టీకి వారసుడిగా లోకేష్ తెరపైకి వచ్చారు. తండ్రి అరెస్టుతో క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఇది చాలదని.. రాజకీయ ప్రత్యర్థులను అధిగమించాలంటే ఇంతకుమించి చేయాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. లీడర్ గా నిరూపించుకునేందుకు ఇది సరైన సమయం అని.. దూకుడుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని.. ఎన్నికలకు మరో మూడు నెలల వ్యవధి ఉందని.. ఈ సమయంలో ఇలా ఉంటే ఎలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

లోకేష్ పాదయాత్రకు సంబంధించి తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా సుమారు వెయ్యి కిలోమీటర్లు లోకేష్ నడవాల్సి ఉంది. రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిచిపోయింది. ఇచ్చాపురం వరకు కొనసాగాలంటే కనీసం వంద రోజులు పాటు నడవాల్సి ఉంటుంది. అంటే ఈ లెక్కన మార్చి వరకు పాదయాత్ర కొనసాగించాల్సి ఉంటుంది. కానీ లోకేష్ లో ఎటువంటి చలనం లేదు. ఒకవేళ చంద్రబాబుకు రెగ్యులర్ పై లభించి.. రాజకీయ కార్యకలాపాలు ప్రారంభిస్తేనే లోకేష్ పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాదయాత్ర ఎప్పుడు మొదలుపెడతారో.. ఒక ప్రత్యేక ప్రకటన చేస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి టిడిపి హై కమాండ్ ఏం చేస్తుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version