RK Big Debate With Revanth: వేమూరి రాధాకృష్ణ బిగ్ డిబేట్: కేటీఆర్ లో లోపించింది.. రేవంత్ లో కనిపించింది అదే

ఆంధ్ర తో పోలిస్తే తెలంగాణలో అరాచకం తక్కువగానే ఉన్నప్పటికీ అహంభావం పెరిగిందని ఆర్కే అంటే కేటీఆర్ ఒప్పుకున్నాడు. మీ నాన్న ప్రజలను కలవకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటో నీకు తెలుసా అంటూ కేటీఆర్ కు హిత బోధ చేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 17, 2023 1:53 pm

RK Big Debate With Revanth

Follow us on

RK Big Debate With Revanth: తన పచ్చ భక్తి పక్కన పెడితే మిగతా విషయాల్లో ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ తన జర్నలిస్ట్ టెంపర్ మెంట్ చూపిస్తాడు. ముక్కు సూటిగా ప్రశ్నలు అడుగుతూనే దానికి కొంచెం లేపనం పూస్తాడు. ఫలితంగా ఎదుటివారు చెప్పేవి అబద్ధాలో, నిజాలో చూసే ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతాయి. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వేమూరి రాధాకృష్ణ తన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కు కాస్త విరామం ఇచ్చినట్టున్నాడు. ఇదే క్రమంలో బిగ్ డిబేట్ నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో బిగ్ డిబేట్ నిర్వహించాడు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు, కెసిఆర్ కు లింకు ఉందని చెప్పడంలో దాదాపు సఫలీకృతుడయ్యాడు. తనకున్న రిలేషన్ వల్ల కెసిఆర్ ను తిక్కలోడు అని తిట్టిపోశాడు. అంతేకాదు జర్నలిస్టుల వల్ల కానిది తన వల్ల అయ్యేది ఏమిటో కేటీఆర్ ఇంటర్వ్యూ ద్వారా నిరూపించాడు.

కేటీఆర్ సైలెంట్ అయ్యాడు

ఆంధ్ర తో పోలిస్తే తెలంగాణలో అరాచకం తక్కువగానే ఉన్నప్పటికీ అహంభావం పెరిగిందని ఆర్కే అంటే కేటీఆర్ ఒప్పుకున్నాడు. మీ నాన్న ప్రజలను కలవకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమిటో నీకు తెలుసా అంటూ కేటీఆర్ కు హిత బోధ చేశాడు. సాధారణంగా ఇంటర్వ్యూలలో ప్రశ్నలు అడిగే జర్నలిస్టుల మీద ఆధిపత్యం చెలాయించే కేటీఆర్.. ఆర్కే అడిగిన అన్ని ప్రశ్నలకు జస్ట్ అలా తల ఊపాడు.. కొన్నింటికి తిరిగి సమాధానం చెప్పినా ఆర్కే అత్యంత తెలివిగా టాకిల్ చేయగలిగాడు. సుదీర్ఘంగా జరిగిన ఈ ఇంటర్వ్యూలో కేటీఆర్ లో ఆత్మవిశ్వాసం తేలిపోయిందని ఆర్కే నిరూపించాడు. చివర్లో మీరు మళ్లీ గెలిస్తే దండ వేయను గాని ఒక పుష్పగుచ్చం అందిస్తానని కేటీఆర్ కు ఆర్కే కౌంటర్ ఇచ్చాడు.

రేవంత్ రెడ్డి ప్రదర్శించాడు

ఇక కేటీఆర్ తో ఎంత సేపయితే డిబేట్ నిర్వహించాడో.. రేవంత్ రెడ్డి తో కూడా అదే స్థాయిలో ఆర్కే గురువారం సాయంత్రం డిబేట్ కొనసాగించాడు. ఈ సందర్భంగా ఇద్దరు మధ్య అనేక ప్రశ్నల పరంపర కొనసాగింది. ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి మొదలు పెడితే కర్ణాటక పరిణామాల వరకు ఆర్కే అడగని ప్రశ్న అంటూ లేదు. అయితే ఇందులో రేవంత్ రెడ్డి ఏ ప్రశ్నకు కూడా నీళ్లు నమల లేదు. నేరుగానే సమాధానం చెప్పాడు. కెసిఆర్ కుటుంబం పై విమర్శలు చేస్తూనే.. తనకు పార్టీ బాధ్యతలు ఎందుకు అప్పగించారో వివరించే ప్రయత్నం చేశాడు. డిసెంబర్ మూడున విజయం సాధిస్తామని, తెలంగాణ ప్రకటించిన డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తానని ఆర్కే ముందు రేవంత్ రెడ్డి ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా దివంగత ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర్ రెడ్డి పనితీరును పొగిడాడు. సెటిలర్ ఓట్లు కాంగ్రెస్ వైపు మరలే విధంగా మాట్లాడాడు. చంద్రబాబు అరెస్టుపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఆర్కే అడిగిన ప్రతి ప్రశ్నలోనూ అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు. డిసెంబర్ 3న ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రస్తుతానికి అయితే తెలియదు గానీ.. ఆర్కే నిర్వహించిన ఇంటర్వ్యూలో మాత్రం కేటీఆర్ ఒకింత నర్వస్ గా కనిపించగా.. రేవంత్ రెడ్డి మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ ను చూపించాడు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ కాలాన్ని భారత రాష్ట్ర సమితి సద్వినియోగం చేసుకుంటుందా, మూడోసారి అధికారంలోకి వస్తుందా? లేక రేవంత్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ జెండా తెలంగాణలో ఎగురుతుందా? రేవంత్ తెలంగాణకు మూడో ముఖ్యమంత్రి అవుతారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.