Telangana Congress : తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల ప్రకటన రాబోతోంది. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల విజయంతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో బాగానే గత కొద్దిరోజులుగా చేరికలతో మంచి జోష్ మీద కనిపిస్తోంది. సీనియర్లంతా ఐక్యత రాగం ఆలపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ 2004 నాటి తీరును ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో బలమైన భారత రాష్ట్ర సమితిని ఢీకొట్టేందుకు మరింత పకడ్బందీ ప్రణాళిక అవసరమని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో.. ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ సభ్యులు పాల్గొన్నారు.
టార్గెట్ 100 రోజులు
వచ్చే నవంబర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అయితే గతంలో మాదిరి ఆదరాబాదరాగా కాకుండా ఈసారి పకడ్బందీ ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా వందరోజులపాటు నిత్యం ప్రజల్లో ఉండాలని నిశ్చయించుకుంది. ఈ వందరోజుల ప్రణాళికలో సభలు, సమావేశాలు, రాజకీయ వ్యవహారాలు, పార్టీలో చేరికలు, యాత్రలు, సామాజిక వర్గాలవారీగా డెకరేషన్లు, ఎన్నికల మేనిఫెస్టో వంటి వాటిపై చర్చించనుంది. అంతేకాదు వీటిని ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుకోనుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా మారింది. అయితే ఈ బలం సరిపోదని, భారత రాష్ట్ర సమితి బలంగా ఉన్న తెలంగాణలో.. ఇంకా బలమైన నేతలు చేరాలని అపార్ట్ నాయకులు భావిస్తున్నారు.
ఐక్యతా రాగం
అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే పార్టీలో నేతలు మొత్తం ఐక్యత రాగం ఆలపించాలని సమావేశంలో నిర్ణయించారు.. ఇందులో భాగంగా మేమంతా ఒక్కటే అనే సంకేతాలు ఇచ్చేలాగా బస్సు యాత్ర నిర్వహించాలని సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలపై ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు భేటీ అయ్యారు. మేమంతా ఒక్కటే అనే సంకేతాన్ని ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణులకు ఇచ్చారు. అంతేకాదు ఎన్నికల్లో ఆచరించాల్సిన వ్యూహాలపై కూడా ఆ సమావేశంలో చర్చించారు. తర్వాత నాలుగు రోజుల వ్యవధి లోనే గాంధీభవన్లో సమావేశం నిర్వహించడం, దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మొత్తం హాజరు కావడం విశేషం.