https://oktelugu.com/

Alert : హైదరాబాదీలకు అలర్ట్‌.. పగటిపూట ఇక ప్రయాణం కష్టమే!?

అన్ని మార్గాల్లో తగ్గిస్తే ఇబ్బంది పడతామని పేర్కొంటున్నారు. అయితే బుధవారం(ఏప్రిల్‌ 17) నుంచి 5 నిమిషాలకు ఒక బస్సు తిరిగే మార్గాల్లో 10 నిమిషాలకు ఒక బస్సును తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇక తగ్గింపు మార్గాలపైనా క్లారిటీ ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 17, 2024 / 09:29 PM IST

    Sunny alert for Hyderabadis

    Follow us on

    Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో ఉదయం 10 గంటల నుంచే జనం బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో చాలా మంది ఉదయమే పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం ఇళ్లకే పరిమితవుతున్నారు. మధ్యాహ్నం చేయాల్సిన పనులను కూడా ఉదయం లేదా సాయంత్రానికి వాయిదా వేసుకుంటున్నారు. దీంతో మధ్యాహ్నం పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సాధారణంగా ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్లన్నీ రద్దీగా ఉంటాయి. పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇప్పుడు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లపై జనం కనిపించడం లేదు. ఇక పనుల మీద బయటకు వచ్చిన వారు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు.

    వెలవెలబోతున్న ఆర్టీసీ బస్సులు..
    ప్రయాణికులు మధ్యాహ్నం బయటకు రాకపోవడం, వచ్చిన వారు కూడా మెట్రో రైళ్లను ఆశ్రయిస్తుండడంతో ఆర్టీసీ బస్సులు ఖాళీగా తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇంధనం వృథా అవుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సిటీ బస్సులను తగ్గించాలి నిర్ణయించింది. ఈమేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ జోన్‌ ఈడీ వెంకటేశ్వర్లు అధికారికంగా తెలిపారు. విపరీతమైన ఎండల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తగ్గిందని వెల్లడించారు. అందుకే బస్సుల సంఖ్య తగ్గించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

    వాతావరణ శాఖ హెచ్చరికలతో..
    మరోవైపు వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలను హెచ్చరిస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దని సూచిస్తోంది. అత్యవసరమై బయటకు వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. రాబోయే మూడు రోజుల్లో ఎండలు మరింత పెరుగతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కూడా ప్రజలను అలర్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ మధ్యాహ్నం బస్సుల సంఖ్య తగ్గించి రాత్రి వేళల్లో ఎక్కువగా తిప్పాలని నిర్ణయించింది. రాత్రి 12 గంటల వరకు బస్సులు తిరగనున్నాయి.

    తగ్గింపు రూట్లపై స్పష్టత కరువు..
    ఇదిలా ఉంటే.. ఆర్టీసీ నిర్ణయంపై ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. ఏయే మార్గాల్లో బస్సులు తగ్గిస్తారు అనేది తెలుపకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అన్ని మార్గాల్లో తగ్గిస్తే ఇబ్బంది పడతామని పేర్కొంటున్నారు. అయితే బుధవారం(ఏప్రిల్‌ 17) నుంచి 5 నిమిషాలకు ఒక బస్సు తిరిగే మార్గాల్లో 10 నిమిషాలకు ఒక బస్సును తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఇక తగ్గింపు మార్గాలపైనా క్లారిటీ ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.