https://oktelugu.com/

Telangana Congress : అధికార పార్టీలో మాదిగల లొల్లి.. టీ.కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి

కాంగ్రెస్‌ పార్టీ మాదిగలకు టికెట్‌ కేటాయించకపోవడంతో మాదిగల ఓట్లు బీజేపీకి పోలరైజ్‌ అవుతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే అన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో మాదిగలు ఉన్నందున కాంగ్రెస్‌ పార్టీ ఇబ్బంది పడుతుందని పేర్కొంటున్నారు. మరి దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానం మాదిగలకు ఎలా నచ్చజెబుతుందో చూడాలి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 17, 2024 / 09:22 PM IST

    New headache for T. Congress with Madigala protest

    Follow us on

    Telangana Congress : తెలంగాణ అధికార కాంగ్రెస్‌లో మాదిగల లొల్లి ముదురుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ ఆ పార్టీకి ఇది కొత్త తలనొప్పి తయారైంది. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని సొంత పార్టీ నేతలే గళమెత్తడం ఆ పార్టీ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఈ విషయంలో కాంగ్రెస్‌ తీరును ఎండగడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీలోనే సీట్ల కేటాయింపుపై నిరసనకు సిద్ధమవుతుండం గమనార్హం.

    మండిపడుతున్న మాదిగలు..
    తెలంగాణలో ఎస్సీ సామాజిక వర్గంలో 70 శాతం మాదిగలే ఉన్నారు. ఇక ప్రస్తుతం పార్లమెంటు స్థానాల్లో 3 ఎస్సీలకు రిజర్వు చేయగా, మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ కనీసం ఒక్క మాదిగకు కూడా టికెట్‌ ఇవ్వలేదు. దీంతో తెలంగాణలోని మాదిగలతోపాటు కాంగ్రెస్‌ పార్టీలోని మాదిగ నేతలు కూడా అధిష్టానం తీరుపై రగిలిపోతున్నారు.

    కాంగ్రెస్‌ టికెట్లు ఇలా..
    లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఇప్పటి వరకు 14 స్థానాలకు టికెట్లు ఖరారు చేసింది. ఇందులో నాగర్‌కర్నూల్, పెద్దపల్లి, వరంగల్‌ ఎస్సీ రిజర్వు నియోజర్గాలు. ఈ మూడు స్థానాల్లో మల్లు రవి(మాల), గడ్డం వంశీకృష్ణ(మాల), కడియం కావ్య(బైండ్ల)కు కాంగ్రెస్‌ సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీ కేటాయిచింది. మూడు స్థానాలను ఒకే సామాజికవర్గానికి కేటాయించడంపై మాదిగలు మండిపడుతున్నారు. పోరాటానికి సిద్ధమవుతున్నారు.

    బీజేపీలో మాదిగలకు ప్రాధాన్యం..
    ఇక తెలంగాణలోని మూడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో బీజేపీ మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చింది. రెండు స్థానాల్లో మాదిగలను, ఒక స్థానంలో మాల ఉప కులమైన నేతకాని వర్గానికి కేటాయించింది. నాగర్‌కర్నూల్‌ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన పోతుగంటి భరత్‌ను ఎంపిక చేసింది. వరంగల్‌ సీటును కూడా మాదిగ సామాజికవర్గానికే చెందిన అరూరి రమేశ్‌కే కేటాయించింది. ఇక పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా నేతకాని కులానికి చెందిన గోమాస శ్రీనివాస్‌ను ప్రకటించింది.

    బీఆర్‌ఎస్‌ కూడా మాదిగలకు రెండు టికెట్లు..
    ఇక తెలంగాణలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ కూడా లోక్‌సభ ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చింది. మూడు నియోజకవర్గాల్లో రెండు మాదిగలకు కేటాయించింది. ఒకటి మాల సామాజిక వర్గానికి ఇచ్చింది. వరంగల్‌ టికెట్‌ను మాదిగ వర్గానికి చెందిన డాక్టర్‌ మారేపల్లి సుధీర్‌కుమార్‌ పేరును ప్రకటించారు. నాగర్‌ కర్నూల్‌ అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ను ఖరారు చేశారు. ఇక పెద్దపల్లి టికెట్‌ను మాల సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు బీఆర్‌ఎస్‌ ఖరారు చేసింది.

    అధికార పార్టీకి తలనొప్పి..
    మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ రెండు సీట్లను మాలలకే కేటాయించింది. మూడో స్థానం మాదిగ ఉప కులమైన బైండ్ల సామాజికవర్గానికి చెందిన కడియం కావ్యకు కేటాయించారు. ఓట్ల శాతంలో అధికంగా ఉన్న మాదిగలకు టికెట్‌ కేటాయించకపోవడంపై కాంగ్రెస్‌ పార్టీలోని మాదిగ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఆ పార్టీలోని మాదిగ నేతలు మండిపడుతున్నారు.

    పోరుబాటలో మాదిగలు..
    అధికార కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం చేయడంపై మాదిగ దండోరా, మాదిగ ప్రజాసంఘాల జేఏసీ, మాదిగ హక్కుల పోరాట సమితి, మాదిగ రాజకీయ పోరాట వేదిక సంఘాల ప్రతినిధులు పోరుబాట పట్టారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మోత్కుపల్లి నర్సింహులు మాదిగలకు జరిగిన అన్యాయంపై దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాదిగలను అంటరానివారిగా చూస్తోందని ఆరోపించారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాదిగ నేత మందా జగన్నాథం కాంగ్రెస్‌ను వీడారు. బీఎస్పీలో చేరి నాగర్‌కర్నూల్‌ టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.

    తెలంగాణ వ్యాప్తంగా ప్రభావం..
    ఎస్సీ రిజర్వేషన్‌ నియోజకవర్గాల్లో మాదిగలకు టికెట్లు ఇవ్వకపోవడంపై మాదిగలు పోరుబాట పట్టడంతో దాని ప్రభావం ఆ మూడు నియోజకవర్గాలకే కాకుండా తెలంగాణలోని మిగతా 14 నియోజవర్గాల్లో ఉంటుందని విశ్లేషకులు, కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే మంద కృష్ణ మాదిగ బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మాదిగలకు టికెట్‌ కేటాయించకపోవడంతో మాదిగల ఓట్లు బీజేపీకి పోలరైజ్‌ అవుతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే అన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో మాదిగలు ఉన్నందున కాంగ్రెస్‌ పార్టీ ఇబ్బంది పడుతుందని పేర్కొంటున్నారు. మరి దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానం మాదిగలకు ఎలా నచ్చజెబుతుందో చూడాలి.