AP Telangana Elections : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి ఘట్టానికి గురువారం తెరలేవనుంది. ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ గురువారం(ఏప్రిల్ 18న) విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది.
నాలుగో విడత నోటిఫికేషన్..
దేశవ్యాప్తంగా 7 విడతల్లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు విడతల్లో జరిగే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. తొలివిడత ఎన్నికలు కూడా గురువారం(ఏప్రిల్ 18న) జరుగనున్నాయి. ఈ క్రమంలో నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం(ఏప్రిల్ 18న) మొదలు కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలిస్తారు. 29 వరకు నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగుతుంది. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.
సర్వేలన్నీ బంద్..
ఏప్రిల్ 18న తెలంగాణ, ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో సర్వేలకు ఫుల్‌స్టాప్ పడనుంది. ఇక ఏ సంస్థ, వ్యక్తి ఎన్నికలకు సంబంధించిన సర్వేలు చేయకూడదు. ప్రజలకు ఫలితాలు వెల్లడించకూడదు. ప్రీపోల్ సర్వే కానీ, ఒపీనియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ నిర్వహించకూడదు. ఫలితాలు ప్రకటించొద్దు. ఏడు విడతల్లో ఎన్నికలు ముగిసన తర్వాత అంటే జూన్ 1న ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడించొచ్చు.
ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇలా..
ఏప్రిల్ 18 నామినేషన్ల స్వీకరణ
ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణ గడువు
మే 13 తెలంగాణలో 17 లోక్‌సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి, ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
జూన్ 4 ఎన్నికల ఫలితాల ప్రకటన