Telugu Print Media : ఓహ్.. జైలులో ఉన్న ఖైదీలను కూడా పండుగ రోజుల్లో సందడి చేసేందుకు అనుమతిస్తారేమో కదా? అయితే ఇక్కడ ఈ హెడ్డింగ్ వర్తించదు అనుకుంట! సగటు జీవులు ఎలాంటి లైఫ్‌ను కోరుకుంటారు? ఒత్తిడి లేని జీవితాన్ని.. చేతినిండా జీతాన్ని! వారం పాటు పనిచేసినా.. మధ్యలో ఒక్కరోజు సరదా సమయాన్ని! ఏదైనా పండుగో.. పబ్బమో.. ఆపదో.. వస్తే సంతోషం, వినోదం, బాధ.. అనుభవించేందుకు.. పంచుకునేందుకు నాలుగైదు రోజుల పని విరామాన్ని! ఇగ రాకపోతయా? అగ రాకపోతయా? అని ఎన్ని రోజులు ఎదురుచూసినా అలాంటి రోజులు దాదాపు డెస్క్ జర్నలిస్ట్‌ల (ఉప సంపాదకులు) జీవితాల్లోకి రాకుండానే పోతున్నాయి. ప్రతి చిన్న పండుగనూ భార్య, పిల్లలు, ఇంటి పెద్దలతో కలిసి ఎంతో ఆర్భాటంగా.. ఆనందంగా.. ఆహ్లాదంగా చేసుకుంటున్న రోజులివి! ఆదివారాలకు తోడు అదనంగా పండుగలు, జయంతులకు వచ్చే సెలవులు ఎంతోమందికి ఉల్లాసాన్నిచ్చి పోతుంటాయి. కొందరి ఇంటిల్లిపాదినీ విహారయాత్రలకు తీసుకెళ్లి వినోదాన్ని పంచుతాయి. ఎక్కడ నోసుకున్నరో గని! డెస్క్ జర్నలిస్టుల జీవితాలు ‘జైలు’ గోడల జాబులకు పరిమితమై ‘తీరక’కు నోసుకోకుండనే ముగుస్తున్నాయి. ‘దరిద్రం తరిమినోళ్లు (తన్నినోళ్లు అని చదువుకోగలరు) డెస్కుల్లోకి వచ్చి పడుతరు’ అని నేను రాసిన నానుడి! పద్దెనిమిదేండ్లుగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మళ్లీ హైదరాబాద్ డెస్కుల్లో (సంచార జీవితమే అంటరా?) మోగిస్తున్న ‘డీజే’ (డెస్క్ జర్నలిస్ట్) మోతకు ఇప్పటికే తల బొప్పికట్టింది. సగానికి పైగా జీవితం నాలుగు గోడల డెస్క్‌లోనే నలిగిపోయింది. ఇన్నేండ్లలో నేను సద్దుల బతుకమ్మ రోజు ఇంట్లో వాళ్లతో కలిసి పండుగ చేసుకున్న రోజులు మహా అయితే నాలుగో.. ఐదు సార్లో ఉండొచ్చు! అదీ నా అదృష్టం కలిసి వచ్చి వీక్లీ ఆఫ్ రోజు పండుగ వస్తేనే సుమా! ఇక వినాయక నిమజ్జనం రోజు దోస్తులతో కలిసి చిందేస్తూ ఎంజాయ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి? కానీ పరిస్థితి ఇందుకు భిన్నం! అందరూ కలిసి సాయంత్రం పూట వినాయక శోభాయాత్రను చూసేందుకు వీధుల్లోకి వస్తే.. మేము మాత్రం అదే సమయానికి పొద్దుమూట (రాత్రి తినేందుకు కట్టుకుపోయేదాన్ని ఏమంటారో?) కట్టుకొని విధులకు పోతాం (రాత్రివేళ జాబులు మరి).
సాయంత్రపు సమయాన ఏ చెరువు గట్టునో.. గుట్టపైనో కూర్చొని సేదతీరే అదృష్టం.. అలా అలా బజారులో షికారు వెళ్లే భాగ్యం మాకు ఇంకా ఎన్నేండ్లకు వస్తుందో! సగటు జర్నలిస్టుకు ఏడాదిలో పండుగ హాలీడేలు నాలుగే నాలుగు (సంక్రాంతి, వినాయక చవితి, దసరా, దీపావళి). ఈ పండుగ రోజుల్లో ముందూ వెనుక ఒక్కటంటే ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ఎక్కడున్నా ఏదో కొంపలు అంటుకుపోయినట్టు.. భూకంపమో.. ప్రళయమో.. సునామో వచ్చినట్టు పరిగెత్తుకు ఆఫీసుకు రావాల్సిందే! భారీ వర్షాలు పడినా.. వరదలు వచ్చినా ‘ఈ రోజు ఆఫీసుకు రాలేను’ అని చెప్పి రాకుండా ఉండడం అసలే కుదరదు! ఇక ఉగాది ఉషస్సులు లేవు.. శివరాత్రి జాగారం లేదు!. శ్రీరామనవమి, హోలీ, రాఖీపౌర్ణమి, కార్తీకపౌర్ణమి ఇలా పండుగలేవైనా మాకు వర్తించవు! ఏండ్లకేండ్లు సబ్ ఎడిటర్లుగా పనిచేస్తూ ఇంకా మూడు పదులు దాటని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నవారు వేలల్లో ఉన్నారు. అది 2020 సంవత్సరం.. నేను కరీంనగర్ నుంచి వరంగల్ బదిలీపై వెళ్లినప్పుడు మా ఇంటి సామాను జారేసిన వ్యాన్ డ్రైవర్ ‘అన్నా మీ జీతమెంత?’ అని అడిగిండు. నేను కక్కలేక మింగలేక ‘29వేలు’ అంటే ‘ఈపాటిదానికే ట్రాన్స్‌ఫర్ అయి ఇక్కడిదాకా వచ్చిండ్రా?’ అన్నప్పుడు నా తల ఎక్కడ పెట్టుకోవాల్నో తెలియలేదు. ఒక్కరోజు కిరాయి పోతే డీజిల్ ఖర్చు పోను ఐదారువేలు సంపాదిస్త అన్నడు.
*అన్నట్టు మేం ఏం పనిచేస్తమో మీకు తెలియదు కదా!
సబ్ ఎడిటర్.. ఉప సంపాదకుడు.. చెప్పడానికి గొప్పగా ఉన్నది కదా.. గొప్ప ఉద్యోగమే.. కానీ, ఇలాంటి వృత్తి ఒకటి ఉన్నదని బహుషా ఏకొద్దిమందికో తప్ప ఎవరికీ తెలియదు. రిపోర్టర్.. విలేకరి.. పేపర్ మిషిన్ ఆపరేటర్.. పేపర్ బాయ్.. ఇవి మినహా జనాలకు డెస్క్ అనేది ఒకటి ఉంటదని, అందులో సబ్ ఎడిటర్లు ఉంటారని తెలియనే తెలియదు ( సర్క్యులేషన్, యాడ్స్, అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, ఎలక్ట్రికల్, డిస్ప్యాచ్ విభాగాల వారిదీ ఇదే పరిస్థితి అనుకోండి). గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, చివరికి దేశ స్థాయి నేతలు కూడా ‘రిపోర్టర్’ అంటే తెలుసు అన్నట్టుగా చూస్తారు గానీ, సబ్ ఎడిటర్ అని చెప్తే మాత్రం తెల్లమొహం వేస్తారు.. ఈ ఉద్యోగంలోకి రావాలంటే ఎంత సాహసం చేయాలో తెలుసా అండీ? ప్రభుత్వ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ పడ్డట్టుగానే అడపాదడపా జర్నలిజం నోటిఫికేషన్లు పడుతుంటయ్. అప్పుడు ఆయా మీడియా సంస్థల యాజమాన్యాలు అడిగిన అప్పటి స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సామాజిక, రాజకీయ, ఇతర పరిస్థితుల మీద వ్యాసాలు రాసి.. వారికి నచ్చితే ఎంపికై.. ఎగ్జామ్ రాసి ఓ ఆరు నెలల నుంచి ఏడాది దాకా పడరాని పాట్లు పడితే తప్ప సాధించలేము. ఏ ఐఏఎస్ కోసమో.. ఐపీఎస్ కోసమో కఠోర దీక్ష చేసినట్టుగా మబ్బుల లేచి టైపింగ్ అని, ఉదయం నుంచి సాయత్రం దాకా వివిధ సబ్జెక్టుల మీద క్లాసులని, సాయంత్రం వ్యాస రచనలని, వారానికి, నెలకో టైపింగ్, ఎడిటింగ్ టెస్టులనీ అబ్బో ఇలా ఎన్నింటినో ఎదుర్కొని వస్తే తప్ప సబ్ ఎడిటర్‌గా నిలబడలేం.. ఇవన్నీ ఒకెత్తయితే వ్యక్తిగతంగా రచనలపై ఇష్టం ఉంటే తప్ప ఈ వృత్తిలో రాణించలేం. విలువగల్ల కొలువే అయినా కొత్తలే (డబ్బులు.. జీతమే సుమండీ) అంతంతమాత్రం! క్షేత్రస్థాయిలో విలేకరులు, ఫొటోగ్రాఫర్లు వార్తలు, ఫొటోలు సేకరించి డెస్క్‌కు పంపిస్తే మేము వాటి తీవ్రత మేరకు మసాలా దట్టించి మంచి శీర్షిక, ఆకట్టుకునే ఉపోద్ఘాతం, అర్థమయ్యేలా వివరంగా.. అక్షరదోషాలు, అన్వయదోషాలు, ఇతరత్రా ఎలాంటి దోశలు, వడలు లేకుండా తీర్చి‘దిద్ది’.. పేజీల్లో అందంగా పెట్టి పాఠకులకు అందిస్తామన్నమాట!
ప్రజా సమస్యలు, మానవీయ కథనాలు, కుంభకోణాలు, అవినీతి, అక్రమాలు, రోడ్డు ప్రమాదాలు, హత్యలు, సాహిత్య, నృత్య, సంగీత, క్రీడా, సినిమా, రాజకీయ, ఆర్థిక పరమైన ఎన్నో వార్తలను ప్రత్యక్షంగా చూసినట్టు, అనుభవించినట్టు భావించి మరీ పాఠకులకు కూడా ఆ భావనను కలిగేలా ‘ఎడిటింగ్’ చేసి చేరవేస్తాం. ఈ ‘రాత్రి వృత్తి’ కత్తిమీద సాములాంటిది. ప్రతిరోజూ కొత్తగా ప్రజెంట్ చేయడం కోసం మెదడుకు సాన పెడుతూ..నే ఉండాలి. కుర్చీలకు అతుక్కుపోయి కంప్యూటర్లలో కండ్లను దూర్చి ఏండ్లకేండ్లు చేస్తున్న ఈ పనిలో మేం సంపాదించేవి.. వెన్నుపోట్లు (బ్యాక్‌పెయిన్), వెనకేసుకునే నాలుగు రాళ్లు (కిడ్నీ స్టోన్స్), ఇక ప్రత్యేకంగా చక్కెర, ఉప్పు తినలేని స్వేచ్ఛ (బీపీ, షుగర్), షోపుటాపు అద్దాలు (చూపు మందగింపు) ఇంకా పేరు తెలియని రోగాలెన్నింటినో..! ఎవరి వద్దా చేయిచాచ లేక.. వచ్చే చాలీచాలని జీతాలతో ఇంటామె, పిల్లలు, పక్కింటి వారు, బంధువుల వద్ద పరువు పోగొట్టుకోలేక.. ఉంటే క్రెడిట్ కార్డులతోనో.. లేదంటే దోస్తుల దగ్గరనో అప్పు చేసి వచ్చే జీతాన్ని రాకముందే ఒడగొట్టుకొని ఒక్కడిగానే కుమిలిపోయే జీవితాలు మావి. అయ్యా ప్రభుత్వ పెద్దలూ.. జర్నలిస్ట్‌లు అంటే కేవలం క్షేత్రంలో తిరిగేవాళ్లే కాదు.. వాళ్లు సేకరించే వార్తలకు జీవం పోసే డెస్క్ జర్నలిస్టులూ అని గుర్తించండి.. (వీ ఆర్ ట్రైన్డ్ జర్నలిస్ట్స్ అండీ).. ఎప్పటినుంచో ఇస్తాం.. ఇస్తాం అని ఊరిస్తూ వస్తున్న ఇండ్ల స్థలాలను నెలగడవని జీతాలతో నెట్టుకొస్తున్న మాదాకా రానివ్వండి! అయ్యా జర్నలిస్ట్ యూనియన్ల పెద్దలూ.. కేవలం మాటలు కాదు.. అసలు దగ్గరికి వచ్చేసరికి మమ్మల్ని పక్కకు తోసేయకుండా జర ముందుకు తోయండి! వీలైతే ఇంకొన్ని పండుగలకు సెలవులు పెంచే ప్రయత్నం చేయండి..!
– రమేశ్ కనపర్తి, చీఫ్ సబ్ ఎడిటర్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Sufferings of sub editors in newspapers in telugu print media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com