TV9 for sale : నిజాలు గడప దాటేలోగా.. అబద్దాలు ఊరంతా తిరిగి వస్తాయి.. ఈ సామెత వార్తాపత్రికలకు, ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానల్స్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. టీ ఆర్ పీ రేటింగ్స్ కోసం, ఏబీసీ(ఆడిట్ బ్యూరో కౌన్సిల్) లో మెరుగైన సర్కులేషన్ ర్యాంకు కోసం ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానల్స్, వార్తాపత్రికలు నానా గడ్డీ కరుస్తాయి. నచ్చిన వాళ్ళ మీద పూలు.. గిట్టని వాళ్ళ మీద రాళ్లు వేస్తాయి. గతంలో ఇలా ఉండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. మీడియా అంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి భజన చేసే బ్యాండ్ మేళంగా మారిపోయింది. దీనికి కారకులు ఎవరు, ఎందువల్ల ఇలా మీడియా దిగజారిపోయింది.. అనే యక్ష ప్రశ్నలు ఇక్కడ అప్రస్తుతం.. సవా లక్ష వ్యవస్థలు దిగజారిపోయినట్టే.. మీడియా కూడా తన విలువలు, వలువలు వదిలేసుకుంది. వ్యాపారులు మీడియా రంగంలోకి రావడంతో అది మరింత దిగజారి పోతోంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఇంకా ఎంత స్థాయికి దిగజారుతుంది? అనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేరు. సరే ఈ ఉపోద్ఘాతం పక్కన పెడితే..
ప్రస్తుతం తెలుగు మీడియాలో ఒక చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇంతకీ ఏంటయ్యా అది అంటే.. తెలుగులో నెంబర్ వన్ న్యూస్ ఛానల్ (బార్క్ రేటింగ్సే పెద్ద దందా) గా టీవీ9 కొనసాగుతోంది. గతంలో ఎన్టీవీ తో కొద్దిరోజులు ఆ స్థానం కోసం టీవీ9 గెట్టు పంచాయితీలు పెట్టుకుంది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. కుట్రలతో తన నెంబర్ వన్ స్థానం లాక్కున్నారని శోకాలు పెట్టింది. చివరికి నెంబర్ వన్ స్థానం రావడంతో సంబరపడ్డది. కుట్రలు అనే మాట మాట్లాడిన తన నాలుకను మడత పెట్టింది. ఇప్పుడు తాజాగా టీవీ9 అమ్ముడు పోతుందని.. ఆల్రెడీ కొందరు కొన్నారని.. ఇప్పుడున్న మేనేజ్మెంట్ కంటే వాళ్లు మరింత ధనవంతులని చర్చ జరుగుతోంది. భారీ డీల్ కుదిరిందని.. హీనపక్షం 3,000 కోట్లకు మించి ఉంటుందని ప్రచారం జరుగుతోంది..
ఈ విషయం టీవీ9 మేనేజ్మెంట్ దృష్టికి రావడంతో ఒక్కసారిగా స్పందించింది. “ఠాట్.. భలే ఉన్నారు మీరు.. అదంతా అబద్ధం.. మా ఛానల్ మేము ఎందుకు అమ్ముతాం? అసలు అమ్మాల్సిన అవసరమేంటి? మా దగ్గరే మస్తు డబ్బుంది తెలుసా? మేమే ఇంకా అంతర్జాతీయ స్థాయిలో వెళ్లాలనుకొని ప్లాన్ చేస్తున్నాం.. సీఎన్ఎన్ ఐబీఎన్ రేంజ్ లో ఎదగాలనుకుంటున్నామని” అంటూ సోషల్ మీడియా వేదికగా టీవీ9 యాజమాన్యం ఓ వివరణ ఇచ్చింది. సరే అదే నిజమే అనుకుందాం.. మరి టీవీ9 అమ్మడం అబద్ధం అయితే.. ఎందుకు మేనేజ్మెంట్ స్పందించినట్టు? వచ్చిన ఆరోపణలు నిరాధారమని చెబుతున్నప్పుడు వివరణ ఎందుకు ఇచ్చినట్టు? అవి గాలి వార్తలు అనుకున్నప్పుడు అలాగే వదిలేయక.. ఎందుకు మరింత వివాదాన్ని లేపుతున్నట్టు.. అంటే ఎక్కడో ఏదో మాడువాసన తగులుతోంది. స్థూలంగా చెప్పాలంటే ఎవరో పెద్ద ప్లేయర్ టీవీ9 నెట్వర్క్ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారని.. కాకపోతే అది ముందుగానే బయటపడిందని చర్చ జరుగుతోంది. ఒక్కటి మాత్రం నిజం టీవీ9 ను ఎవరూ కొనుగోలు చేయలేరు. కొనేంత సాహసానికి ఒడి గట్టరు. ఆ భారం మొత్తాన్ని మై హోమ్ మోయాలి. మెఘా భరించాలి.. కానీ ఇక్కడే అంతర్జాతీయ ప్రాచుర్యం.. గ్లోబల్ మీడియా ప్లేయర్ అంటూ టీవీ9 యాజమాన్యం ఇస్తున్న వివరణలే నువ్వు తెప్పిస్తున్నాయి.. చివరికి ఆ వివరణను ఏప్రిల్ ఫూల్ జోక్ ను తలపిస్తున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The owner of the company that explained the news of the sale of tv9
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com