Journalism : జర్నలిస్ట్ అంటే వార్తను సేకరించేవాడు. విషయాన్ని ప్రజల ముందు ఉంచేవాడు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండేవాడు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు అలా లేదు. అలా ఉంటే యాజమాన్యాలకు కుదరదు.. ఏం చదువుకున్నావ్ అనేది లెక్క కాదు. తెలుగు భాష మీద ఎంత పట్టు ఉన్నదనేది ప్రామాణికం కాదు. ఎన్ని యాడ్స్ తేగలవ్?, ఎన్ని పేపర్లు కట్టించగలవ్?, వార్షికోత్సవానికి ఎన్ని లక్షలు ఇవ్వగలవ్?, ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థితో ఎన్ని డబ్బులు ఇప్పించగలవ్?, ఎడిటరో, ఎండీనో వస్తే ఎలా ఏర్పాట్లు చేయగలవ్?, బ్రాంచ్ మేనేజర్ కు, ఎడిషన్ ఇంచార్జ్ కు, బ్యూరో చీఫ్ కు ఎలాంటి పనులు చేయగలవ్? ఇవే ప్రామాణికాలు. నువ్వు దందాలు చేయగలవా?, దోపిడీ చేయగలవా?, తిమ్మినిబమ్మి, బమ్మిని తిమ్మి చేయగలవా? అలా అయితే నీకు అక్రిడిటేషన్ లభించినట్టే.. మేనేజ్మెంట్ ఐడి కార్డ్ ఇచ్చినట్టే.. ఇలానే సాగుతోంది మీడియా లో జర్నలిస్టులు అలియాస్ ఎర్నలిస్టుల వ్యవహారం.
శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో నీరుటి రవి, అతడి ముగ్గురు కుమారుల ఆత్మహత్య వెనుక విలేకరుల హస్తం ఉంది. ఇలా విలేకరులు బరితెగించడానికి ప్రధాన కారణం యాజమాన్యాలు. వాటి ధన దాహం. ఎంతసేపు తమకు ఏమొస్తుంది.. రిపోర్టర్ ఎంతిస్తున్నాడు.. అనే యావ తప్ప . బాధ్యత గల మీడియాగా సమాజానికి మనం ఏం ఇస్తున్నాం అనేదాన్ని యాజమాన్యాలు పూర్తిగా మర్చిపోయాయి. ప్రతి విషయాన్ని తమకు అనుకూలమైన కోణంలోనే చూస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పత్రిక ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు నిర్వహిస్తుంది. ఫైనల్ పోటీలను ఆ పత్రిక హైదరాబాద్లో నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మొత్తం ఓ కంట్రిబ్యూటర్ పర్యవేక్షించాడు అంటే అతడి రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఒక కంట్రిబ్యూటర్ స్థాయి వ్యక్తి ఏర్పాట్లు మొత్తం చూసుకున్నాడు అంటే.. అతడు ఎంతమందిని వేధించి ఉంటాడు? ఎంతమందిని ఇబ్బంది పెట్టి ఉంటాడు? ముగ్గుల పోటీలు నిర్వహించకుంటే వచ్చే నష్టం ఏమైనా ఉందా? ముగ్గుల పోటీలోనూ రెవెన్యూ కోణాన్ని చూడాలా? ఇలాంటి మేనేజ్మెంట్లా సమాజాన్ని ఉద్ధరించేది?
కేవలం పైన చెప్పింది ఉదాహరణ మాత్రమే. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరు పొందిన ఓ మండలానికి కంట్రిబ్యూటర్ ను ఎంపిక చేసినందుకు ఓ పత్రిక ఎడిటర్ లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు. ఆ జిల్లాకు బ్యూరో చీఫ్ గా ఉన్న వ్యక్తి అదే స్థాయిలో వసూలు చేశాడు. ఎడిషన్ ఇంచార్జ్ కు అదే స్థాయిలో డబ్బులు వచ్చాయి. మరి వీళ్ళకు ఈ స్థాయిలో ఇచ్చిన వ్యక్తి.. ఏ స్థాయిలో వసూలు చేసి ఉంటాడు? ఏ స్థాయిలో జనాలను ఇబ్బంది పెట్టి ఉంటాడు? ఇలాంటి వాళ్లు సమాజానికి చీడపురుగులు కాదా? అలాంటి వారికి ఎమ్మెల్యేల నుంచి స్థానిక అధికారుల వరకు గౌరవం ఇస్తారు. వారి తప్పులు బయటపడకుండా ఈ బీ గ్రేడ్ విలేకరులను కాపాడుకుంటారు.
శంకర్ పల్లి మండలం టంగుటూరులో జరిగిన ఉదంతంలో కేవలం ఐదుగురు విలేకరుల పాత్ర మాత్రమే కాదు.. వారి వెనుక ఉండి ఇటువంటి పనులకు పురిగొలిపిన యాజమాన్యాలకు కూడా బాధ్యత ఉంటుంది. ఆ యాజమాన్యాలను కూడా జైల్లో వేయాలి. అప్పుడే మిగతావారు ఇలాంటి పనులు చేసేందుకు భయపడుతుంటారు. వెనుకటి రోజుల్లో శ్రీశ్రీ ఊరికనే చెప్పలేదు.. పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలని..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Journalists robbing under the guise of journalism
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com