Journalism : అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఆ పత్రిక యాజమాన్యం అడ్డగోలుగా పేజీలు ప్రచురించేది. ఎలాగూ అధికారంలో ఉంది కాబట్టి.. అప్పటి ప్రభుత్వ పెద్దల సొంత పత్రిక కాబట్టి విపరీతంగా యాడ్స్ వచ్చేవి. ఏబిసి రేటింగ్ తో సంబంధం లేకుండా ప్రైవేట్ కంపెనీలు ప్రకటనలు ఇచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అధికారం పోయిన తర్వాత ఆ పత్రిక అసలు రూపం బయటపడుతోంది.
గొప్పగా చెప్పుకునే వేతనాలు లేకపోయినప్పటికీ..
పదేళ్లపాటు అధికారంలో ఉన్న పెద్దలు ఆ పత్రిక నిర్వహణ బాధ్యతలను చూసుకున్నారు. పెద్దగా, గొప్పగా చెప్పుకునే వేతనాలు లేకపోయినప్పటికీ.. డెస్క్ జర్నలిస్టులు అధికారంలో ఉంది కాబట్టి, పైగా అధికార పత్రిక కాబట్టి తమకు ఎంతో కొంత లాభం జరుగుతుందని పనిచేశారు. పోటీ పత్రికల కంటే తక్కువ స్థాయిలో వేతనాలు ఇచ్చినా అప్పటి అధికార పార్టీ కార్యకర్తల కంటే మించి పనిచేశారు. కానీ వారి శ్రమను ఆ పత్రిక యాజమాన్యం ఎప్పుడూ గుర్తించలేదు. పైగా ఆ పత్రికకు అప్పట్లో కొత్తగా ఒక ఎడిటర్ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆ పత్రికలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటిదాకా సెంట్రల్ డెస్క్ లో పనిచేసినవారు బయటికి వెళ్లిపోయారు. ఆ ఎడిటర్ తన వర్గం వారితో సెంట్రల్ డెస్క్ ను మొత్తం నింపేశారు. తనకు నచ్చిన వారికి అద్భుతమైన జీతాలు వేయించుకున్నారు. ఇందుకు ఓచర్ పేమెంట్లు అదనం. అయితే తమకు వేతనాలు పెంచకపోవడంతో అప్పట్లో జిల్లాల్లో పనిచేస్తున్న సబ్ ఎడిటర్లు యాజమాన్యం తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. చివరికి ఆ ఎడిటర్ రంగంలోకి దిగి.. నచ్చ చెప్పారు. ఆ తర్వాత జీతం పెంచేది పక్కన పెట్టి.. ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక చాలామంది ఆ వేతనాలకే పని చేశారు. చివరికి ఎన్నికల సమయంలోనైనా వేతనాలు పెంచుతారు అనుకుంటే.. అది కూడా చేయలేదు. ఇప్పుడు అధికారం పోయింది. ఆ పత్రిక నిర్వహణ గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మారింది.
పేజీలను కుదించింది..
గతంలో ఇష్టానుసారంగా పేజీలు ప్రచురించిన ఆ పత్రిక.. ఇప్పుడు పూర్తిగా కుదించింది. అంతేకాదు ఉద్యోగులను కూడా పొమ్మనలేక పొగ పెడుతోంది. జిల్లాల్లో స్థిరపడి.. వచ్చే ఆమాత్రం వేతనంతో బతుకు బండి లాగిస్తున్న చాలామంది డెస్క్ జర్నలిస్టులను బదిలీ చేసేందుకు ఆ పత్రిక యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, మహ బూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న సబ్ ఎడిటర్లకు వర్తమానం అందింది. ఒక్కో డెస్క్ నుంచి తక్కువలో తక్కువ ముగ్గురు నుంచి నలుగురు సబ్ ఎడిటర్లను హైదరాబాద్ బదిలీ చేసింది. హైదరాబాద్ వెళ్లడం ఇష్టం లేని వారు ఉద్యోగం మానేయొచ్చని ఉచిత సలహా పడేసింది. హైదరాబాదులో విపరీతమైన ఖర్చులు.. వచ్చే జీతం అంతంత మాత్రం.. దీంతో చాలామంది ఉద్యోగం మానేసేందుకే సిద్ధమైనట్టు తెలుస్తోంది.
కొత్త ఎడిటర్ కనుసన్నల్లో..
ఈ ప్రణాళిక మొత్తం కొత్తగా వచ్చిన ఎడిటర్ కనుసనల్లో జరుగుతోందని తెలుస్తోంది. ఆయన గతంలో ఓ పత్రికలో పనిచేసినప్పుడు ఇలానే సబ్ ఎడిటర్లను ఇబ్బంది పెట్టే వాడని.. ఇప్పుడు అదే ధోరణి ఈ పత్రికలో కొనసాగిస్తున్నాడని జర్నలిస్టు సర్కిల్లో ప్రచారం జరుగుతోంది..”అసలే ప్రింట్ మీడియాకు కాలం చెల్లిపోయింది. డెస్క్ లో పనిచేసే సబ్ ఎడిటర్లకు బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. పైగా 10 సంవత్సరాలు వారు అంతంత మాత్రం జీతాలతో నెట్టుకొచ్చారు. ఇప్పుడు అధికారం పైన తర్వాత వారిని బదిలీ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో ఆ మేనేజ్మెంట్ ఆలోచించాలని” సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు.
ఉన్న వారిపై మరింత ఒత్తిడి
మరోవైపు బదిలీ అయిన జర్నలిస్టుల స్థానంలో కొత్తవారిని ఆపత్రిక యాజమాన్యం తీసుకోవడం లేదు. ఉన్నవారితోనే పేజీలు పెట్టించాలని నిర్ణయించింది. గతంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు పేజీలు ప్రచురించిన ఆ పత్రిక.. ఇప్పుడు ఉమ్మడి జిల్లా మొత్తానికి రెండు పేజీలు మాత్రమే కేటాయించింది. ఆ పేజీలు మొత్తం ఒకరు లేదా ఇద్దరు సబ్ ఎడిటర్లతో పెట్టించాలని భావిస్తోంది. స్థూలంగా ఒక ఉమ్మడి ఎడిషన్ కు ఒక ఎడిషన్ ఇంచార్జి , ఇద్దరు సబ్ ఎడిటర్లు, ఒక రిలీవర్ తో కలిపి పని చేయించాలని భావిస్తోంది. అసలే సబ్ ఎడిటర్ ఉద్యోగం అంటే నిప్పుల మీద నడకలాగా ఉంటుంది. పైగా రాత్రిపూట పని చేయాల్సి ఉంటుంది.. అంతటి ఒత్తిడి మధ్య.. పనిచేసే సబ్ ఎడిటర్ల పీక మీద కత్తిపెట్టడం యాజమాన్యానికి భావ్యం కాదని అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: After losing power a newspaper transfers journalists at will
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com