CM KCR : ‘కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడారు. ఆయన లేకుంటే తెలంగాణ ఏమయ్యేదో.. మన నాయకుడిని కాపాడుకోవాలి’ సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేస్తారు? ఓ బీఆర్‌ఎస్ నాయకుడో, లేక మంత్రులో, ఎమ్మెల్యేలో.. ఎందుకంటే కేసీఆర్ వారి బాస్ కాబట్టి.. దేశ రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో వ్యక్తి పూజ తారాస్థాయికి చేరింది కాబట్టి.. కానీ పై వ్యాఖ్యలను వైద్యారోగ్య శాఖను పర్యవేక్షించే ఓ కీలక అధికారి చేశాడు. పైగా ఆయన కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ స్థానం టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఒంటికి గులాబీ రంగు పూసుకుని పోతురాజు మాదిరి కేసీఆర్ కీర్తన చేశాడు.
రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్) డాక్టర్ గడల శ్రీనివాసరావు సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తడంలో అన్ని హద్దులను దాటుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారినన్న విషయాన్నే మరిచిపోతున్నాడు. శృతిమించిన ‘కేసీఆర్’ భక్తిని చాటుకుంటున్నారు. తన పరిధులనన్నింటిని జుజుబి అనుకంటూ కేసీఆర్ భజనలోనే మునిగిపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను తప్ప మరొకర్ని సీఎంగా ఊహించుకోలేమని అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరో వందేళ్ల వరకు కేసీఆర్ లాంటి నాయకుడిని చూడబోం అని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
శుక్రవారం కోఠిలోని డీఎంహెచ్‌ఎ్‌స క్యాంప్‌సలో బీఆర్‌ఎస్ అనుబంధ సంఘమైన బీఆర్‌టీయూహెచ్-1 యూనియన్ కార్యాలయాన్ని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డితో కలిసి డీహెచ్ గడల ప్రారంభించారు. ‘రాష్ట్రంలో వచ్చే దఫా కూడా కేసీఆరే సీఎంగా ఉంటారు. దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా ఉంటుంది. మొరగని కుక్క ఉండదు.. విమర్శించని నోరు ఉండదు.. ఈ రెండూ ఉండని ఊరు లేదని’ తాజాగా విడుదలైన జైలర్ సినిమా ప్రీ రిలీల్ ఈవెంట్ సందర్భంగా రజనీకాంత్ చెప్పిన మాటను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
నాడు ఉద్యమ నేతగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయనపై మొరగని కుక్క అంటూ ఏదీ లేదని, ఆయన్ను విమర్శించని నోరు లేదని, ఆ రెండూ జరగని ఊరు, వాడ, పట్టణం ఏదైనా ఉందా? అయినా ఆయన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారుజ కేసీఆర్ కృషిలో భాగంగానే బంగారు తెలంగాణను నిర్మించుకుంటున్నామని పేర్కొన్నారు. సీఎంతో పాటు అడుగులో అడుగు వేయాల్సిన అవసరం ఉంది. మన బిడ్డల భవిష్యత్తు దృష్టా, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మన నాయకుడిని మనం కాపాడుకోవాలి’ అని గడల వ్యాఖ్యలు చేయడం విశేషం.