Chakali Ilamma: ఐలమ్మ పుట్టింది చాకలి కులంలో. ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో జన్మించింది. పాలకుర్తి మండల కేంద్రానికి ఐలమ్మ కోడలిగా వచ్చింది. ఆ రోజుల్లో తన కుల వృత్తిపై ఆధారపడి ఐదుగురు కొడుకులు, ఒక కూతుర్ని పోషించుకునే పరిస్థితి లేకపోవడంతో ఆమె కుటుంబం వ్యవసాయం చేయాలని భావించింది. పాలకుర్తి లోని మల్లంపల్లి ప్రాంతానికి చెందిన మక్తే దారు కొండలరావు కు చెందిన భూమిని కౌలుకు తీసుకుంది. ఇదే క్రమంలో కొండలరావు తల్లి జయప్రద దేవి అయిలమ్మకు అండగా నిలిచింది. ఐలమ్మ తన భర్త నరసయ్య, అప్పటికే ఎదిగిన కొడుకులు సోమయ్య, లచ్చయ్య, ముత్తి లింగయ్య, లక్ష్మీ నరసయ్య, ఉప్పలయ్య, తమ్ముడు సోంమల్లయ్యతో కలిసి వ్యవసాయం చేసి పంటలు బాగా పండించింది. పంటలు బాగా పండుతూ కుటుంబం ఆర్థికంగా నిలబడుతున్న సమయంలో ఆమెకు వర్తిల్లి వచ్చాయి. ఇదే సమయంలో పోలీస్ పటేల్ వీరమనేని శేషగిరిరావు తో ఐలమ్మ కుటుంబానికి విభేదాలు ఏర్పడ్డాయి. ఐలమ్మ కౌలుకు చేస్తున్న భూములకు వెళ్లాలంటే శేషగిరిరావు పొలం నుంచి వెళ్లాలి. అందుకుగాను ముందు తన పొలంలో పనిచేసిన తర్వాతే.. కౌలుకు చేస్తున్న భూముల్లోకి వెళ్లాలని శేషగిరిరావు ఐలమ్మను ఆదేశించాడు. దాన్ని ఐలమ్మ ధిక్కరించి పంటలు సాగు చేసింది. ఇక అప్పట్లో దొరలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న ఉద్యమం ఐలమ్మను ఆకర్షించింది. వెంటనే కమ్యూనిస్టు పార్టీలో చేరింది. ఆ పార్టీ నిర్వహించే సభలలో ఆమె ఉత్సాహంగా పాల్గొనేది. ఇది విస్నూర్ దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డికి నచ్చేది కాదు. దీంతో అతడు ఐలమ్మ పై ఫిర్యాదు చేశాడు.
విచ్చిన్నం చేసేందుకు కుట్రలు
ఐలమ్మ చేస్తున్న పోరాటాలను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు జరిగాయి. 1945లో శివరాత్రి సందర్భంగా పాలకుర్తిలో సభ నిర్వహించాలని కమ్యూనిస్టులు నిర్ణయించారు.. అది విజయవంతం అయితే తనకు ఇబ్బంది అని భావించిన ఆధిపత్య కులాలు గుండాలను రంగంలోకి దింపారు. వారు నాటి కమ్యూనిస్టు నాయకులు ఆరుట్ల రామచంద్ర రెడ్డిని చంపేస్తామని బహిరంగ హెచ్చరించారు. దీంతో కమిషనర్ నాయకులు పోలీసులను సంప్రదించి, తమకు భద్రత కల్పించాలని కోరినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. పైగా వారు దేశ్ ముఖ్ కు అనుకూలంగా వ్యవహరించారు.. దీంతో వారు పాలకుర్తిలో ఒక నిర్మానుష ప్రాంతంలో సభ నిర్వహించగా.. దానిని గుండాలు అడ్డుకొని, అల్లరి సృష్టించారు.. రామచంద్ర రెడ్డి పై దాడికి దిగేందుకు ప్రయత్నించగా.. ఆంధ్ర మహాసభ కార్యకర్తలు ప్రతిదాటికి దిగారు. ఆ సమయంలో రామచంద్రారెడ్డిని మారువేషంలో ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వావిలాల గ్రామానికి పంపారు. ఇదే సమయంలో పోలీసులకు దేశ్ ముఖ్ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఒక ఐలమ్మ పండిస్తున్న పంటను దోచుకునేందుకు దేశ్ ముఖ్ తప్పుడు పత్రాలు సృష్టించి బెదిరించడం మొదలుపెట్టారు. ఇక అప్పటికే ఐలమ్మ భర్త, కొడుకులు కేసులలో జైల్లో ఉన్నారు.
ఆమె ఇల్లే ఓ ఉద్యమ కేంద్రం
ఇలా దేశ్ ముఖ్ ఎన్ని ఎత్తులు వేసినా ఐలమ్మ భయపడలేదు. దీంతో అతడు పాలకుర్తి గ్రామం పై వరసగా దాడులు చేయించాడు. ఐలమ్మ ఇంటిని దుండగులు దోచుకున్నారు. కమ్యూనిస్టు కార్యకర్తల ఇళ్లకు నిప్పులు పెట్టారు. ఐలమ్మ కూతురు శోభన నరసన్న పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ ఐలమ్మ ధైర్యంగా నిలబడింది. తన ఇంటిని ఉద్యమ కేంద్రంగా చేసి.. పోరాటాలను విస్తృతం చేసింది. ఐలమ్మ కొడుకులు దళ కమాండర్లుగా ఎదిగారు. ఐలమ్మ పిలుపుతో భూ పోరాటం సాయుధ పోరాటంగా ఆవిర్భవించింది వేలాది ఎకరాలను పేదలకు పంచారు. దీంతో గ్రామ స్వరాజ్యం ఏర్పడింది. ఫలితంగా ఐలమ్మ కమ్యూనిస్టు ఐలమ్మగా అవతరించింది. వృద్ధాప్య భారం తో ఐలమ్మ సెప్టెంబర్ 10న కన్ను మూసింది. 2017 సెప్టెంబర్ 10న ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని మీరు తెలుగు రాష్ట్రాల వామపక్ష పార్టీలు ఆవిష్కరించారు. ఇక 2022లో అప్పటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పాలకుర్తిలో రోడ్డు విస్తరణలో భాగంగా చౌరస్తాలోని ఐలమ్మ విగ్రహాన్ని తొలగించింది. దానిని ఏర్పాటు చేసేందుకు ఆగస్టులో తాత్కాలిక గద్దెను నిర్మించింది. అయితే అది ఇప్పటికీ పూర్తికాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శాశ్వత నిర్మాణాన్ని చేపట్టేందుకు ఐదు లక్షలతో స్లాబ్, రైలింగ్ స్టీల్ తో మెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.. జయంతి నాటికి దానిని సిద్ధం చేయాలని భావిస్తున్నారు.