Gollabhamma Weavers: గొల్లభామ చీర.. నెత్తిన చల్లకుండ, కుడి చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నిండైన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం.. గొల్లభామ చీరల్లో కనిపిస్తుంది. గొల్లభామ చీరలంటే ఇష్టపడని మహిళా ఉండరనే చెప్పవచ్చు. నేత కార్మికుల కళాత్మకతకు ఈ చీరలు నిలువుటద్దం. ఒక్కో పోగును పేర్చి అద్భుతమైన డిజైన్లు చేసి ఆకట్టుకుంటారు. గొల్లభామల చీరల సిద్ధిపేట జిల్లాలో తయారవుతాయి. ఇక్కడి నేత కార్మికుల మదిలో వచ్చిన ఆలోచనతో ఇలాంటీ చీరలను తయారు చేయాలని అనుకున్నారు. వీరి ప్రతిభకు యునెస్కో మెచ్చి గుర్తింపు ఇచ్చింది. అయితే ప్రస్తుతం వారి జీవితాల్లో వెలుగులు కరువయ్యాయి. సరైన మూలధనం లేక చీరల ఉత్పత్తులు నిలిచిపోయాయి. గొల్లభామ చీరలు నేసేవారికి ప్రోత్సాహం కరువవడంతో నేత కార్మికులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు.
సిద్ధిపేటకు చెందిన గొల్లభామ చీరలు అత్యథిక నాణ్యతతో కలిగి ఉంటాయి. ఈ చీరలు కాటన్ రకం వస్త్రంతో తయారు చేస్తారు. డిజైన్ లోని చిక్కులను నొక్కి చెప్పడానికి ప్రత్యేక రంగును కలిగి ఉంటాయి. ఈ చీరలు ప్రధానంగా ఆర్గానిక్ షేడ్ లు ప్యాలెట్ ను ప్రదర్శిస్తాయి. శ్రావ్యమైన, పరిపూర్ణమైన మిశ్రమాలను సృష్టించడానికి అప్పుడప్పుడు అదనపు రంగులను కూడా నేత కార్మికులు చేర్చుతూ ఆకట్టుకుంటున్నారు. సాధారణంగా కొన్ని చీరలు సాంచెలపై తయారవుతాయి. మరికొన్ని మిషన్లపై విభిన్నమైన డిజైన్లు ముద్రించబడుతాయి. గొల్లభామల చీర ప్రత్యేకమేంటంటే.. వీటి తయారీలో మిషన్లను అస్సలు ఉపయోగించరు. చేతితో మాత్రమే చీరలను తయారు చేస్తారు. నేత కార్మికుల అద్భుత కళా నైపుణ్యంతో వివిధ డిజైన్లను చేతితో వేయడం మాములు విషయం కాదు.
గొల్లభామల చీరలను సిద్ధిపేట నేత కళాకారులు దశాబ్దాల కిందటి నుంచే తయారు చేస్తున్నారు. 70 ఏళ్ల కిందట వీరబత్తిని సోమయ్య, రచ్చ నర్సయ్యలు వీటిని తయారు చేయడంలో ప్రసిద్ధి గాంచారు. ఒకరోజు వీరు తలమీద కడువ పెట్టుకున్న ఓ మహిళను చూసి అలాంటి చీరను తయారు చేయాలని అనుకున్నారు. దీంతో ప్రత్యేక సాంచెను ఏర్పాటు చేసి గొల్లభామ చీరను తయారు చేశారు. అలా అప్పటి నుంచి ఈ చీరలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ చీరలను ప్రధానంగా ‘టెస్కో, అప్కో, లేపాక్షి సంస్థలు తో పాటు మరికొందరు వ్యాపారులు విక్రయిస్తున్నారు.
దేశ విదేశాల్లో గొల్లభామల చీరలకు గుర్తింపు వచ్చింది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో వీటికి డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఆన్ లైన్లోనూ వీటిని విక్రయిస్తున్నారు. 1980లో సిద్ధిపేట పర్యటనకు వచ్చిన నాటి రాష్ట్రపతి జైల్ సింగ్ ఈ చీరలను చూసి ముగ్ధుడయ్యాడు. 2022 డిసెంబర్ లో గొల్లభామ చీరలను యునెస్కో గుర్తింపు ఇచ్చింది. ఇప్పటికీ సిద్ధిపేటకు ఏ ప్రముఖుడు వచ్చినా గొల్లభామ చీరలను బహుమతిగా ఇస్తున్నారు.
అయితే ఈ చీరలన తయారు చేసేవారి పరిస్థితి దయనీయంగా మారింది. సిద్ధిపేట కు చెందిన ముదిగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ సవాలక్ష సవాలు కేవలం ఉత్పత్తి ప్రక్రియలోనే పూర్తికాదని, ఎంతో శ్రమ అవసరం ఉంటుందని అన్నారు. గొల్లభామల చీరలు తయారు చేయడానికి నేత కార్మికులకు మూలధనం సరిపోవడం లేదు. దీంతో చాలా మంది నేతన్నలు మగ్గాలను వీడుతూ ఇతర రంగాల్లో చేరుతున్నారు. ఫలితంగా మగ్గాలు మూగబోతున్నాయి. గొల్లభామ చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉన్నందున వీటికి ఆన్ లైన్ మార్కెటింగ్ గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. సిరిసిల్ల ప్రాంతంలో పవర్ లూం ఎక్కువగా అభివృద్ధి చెందుతోంది. తమకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహ అందించాలని గొల్లభామ నేతన్నలు కోరుతున్నారు.