SLBC Incident: నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ సొరంగంలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. నాటి నుంచి నేటి వరకు వారి కోసం రాష్ట్ర ప్రభుత్వ బలగాలు.. రెస్క్యూ మేనేజ్మెంట్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే నిన్నటి రాత్రి వరకు వారి ఆచూకీ లభించలేదు.
ర్యాట్ హోల్ మైనర్స్, సింగరేణి, కేంద్ర బలగాలను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో చివరి ప్రయత్నం గా రాష్ట్ర ప్రభుత్వం కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను ప్రభుత్వం రప్పించింది. ఈ కుక్కలు బెల్జియన్ మాలినోస్ జాతికి చెందినవి. ఇవి 15 మీటర్ల లోతులో ఉన్న మనుషుల అవశేషాలను గుర్తిస్తాయి. ప్రమాదం చోటుచేసుకున్న 100 మీటర్ల దూరంలో ఉన్న డీ – 2 పాయింట్ లో మనుషుల ఆనవాళ్లను క్యాడవర్ డాగ్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. సిబ్బంది కూడా అత్యంత జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు. గల్లంతైన వారిలో కొంతమందిని ఆదివారం సాయంత్రానికి గుర్తిస్తారని తెలుస్తోంది. అధికారులు మాత్రం కార్మికుల ఆనవాళ్లు లభించిన విషయాన్ని ఇంతవరకు ధృవీకరించలేదు.
అందువల్లే ఇబ్బంది
ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ లో బురద విపరీతంగా పేరుకుపోవడం.. మట్టి విపరీతంగా రావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. సొరంగం తవ్వుతున్న క్రమంలో ఒక్కసారిగా పై కప్పు కూలింది. దాంతోపాటు విపరీతమైన బురద.. నీరు రావడంతో కార్మికుల ఆచూకీ లభించకుండా పోయింది. గత 16 రోజులుగా వివిధ బలగాలు సహాయక చర్యలలో పాలు పంచుకుంటున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే కేరళ జాతికి చెందిన ఈ కుక్కలు మనుషుల ఆనవాళ్లను పసిగట్టడంలో దిట్ట. అందువల్లే వాటిని రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. కేరళ ప్రభుత్వం ప్రకృతి విపత్తులను చోటుచేసుకున్నప్పుడు ఈ కుక్కల ద్వారానే సహాయక చర్యలు చేపడుతుంది. ఎవరైనా చనిపోతే వారిని పసిగట్టడానికి వీటిని ఉపయోగిస్తుంది. అందువల్లే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేరళ నుంచి ఆ కుక్కలను రప్పించింది. సంఘటనా స్థలం వద్ద కుక్కలను విస్తృతంగా ఉపయోగించి కార్మికుల ఆనవాళ్లను కనుక్కునే విధంగా చేసింది. బహుశా ఆదివార సాయంత్రం వరకు అధికారులు కార్మికుల ఆచూకీకి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇన్ని రోజులపాటు టన్నెల్ లో చిక్కుకుపోయిన వారు.. బతికి ఉండడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ మాత్రం దానిని కొట్టి పారేస్తోంది.
కేరళ కుక్కలు కార్మికుల ఆనవాళ్లను పసిగట్టినప్పటికీ.. వారిని బయటకు తీయడంలో ఇంకా ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తోంది. బురద, నీరు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని తెలుస్తోంది. విరిగిపడిన మట్టి.. అందులో ఉన్న రాళ్లు బయటికి రావడం సాధ్యం కావడంలేదని సమాచారం. ఆ బురదను, మట్టిని ఎలా బయటికి తొలగిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వాటిని వెలికి తీస్తేనే కార్మికులను బయటికి తీసుకురావడానికి మార్గం ఏర్పడుతుంది.
Also Read: తెలంగాణ ‘గ్రూప్స్’ ఫలితాల షెడ్యూల్ ఖరారు.. ఏ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే..