Metro Hyderabad: మెట్రో ప్రయాణికులకు షాక్‌.. వేసవి సెలవుల వేళ ఆ కార్డులు రద్దు?

వేసవి సెలవుల్లో మెట్రో రైలులో రాయితీ కార్డు మీద నగరాన్ని చుట్టేసి రావాలనుకుంటున్న వారికి హైదరాబాద్‌ మెట్రో అధికారులు షాక్‌ ఇచ్చారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న రాయితీ కార్డులను కూడా రద్దు చేస్తున్నట్లు ఆదివారం(ఏప్రిల్‌ 7న) ప్రకటించారు.

Written By: Raj Shekar, Updated On : April 7, 2024 3:38 pm

Metro Hyderabad

Follow us on

Metro Hyderabad: మరో పక్షం రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే ఇంటర్‌ కళాశాలలకు సెలవులు వచ్చాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు రెండు నెలలపాటు సెలవులను ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్‌ 25 నుంచి పాఠశాలలకు సెలవులు. జూన్‌ 11 వరకు సెలవులు కొనసాగుతాయి. సెలవుల్లో నగరానికి వచ్చే వారు పెరుగుతారు. అయితే నగరానికి వచ్చే పర్యాటకులకు మెట్రో రైల్‌ లిమిటెడ్‌ అధికారులు షాక్‌ ఇచ్చారు.

రాయితీలు ఎత్తివేత..
వేసవి సెలవుల్లో మెట్రో రైలులో రాయితీ కార్డు మీద నగరాన్ని చుట్టేసి రావాలనుకుంటున్న వారికి హైదరాబాద్‌ మెట్రో అధికారులు షాక్‌ ఇచ్చారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న రాయితీ కార్డులను కూడా రద్దు చేస్తున్నట్లు ఆదివారం(ఏప్రిల్‌ 7న) ప్రకటించారు. రాయితీ ప్రయాణాలన్నీ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో మెట్రో రైలులో రూ.59తో హాలిడే కార్డు అమలులో ఉండేది. ఈ రాయితీ కార్డును అధికారులు రద్దు చేశారు.

రెగ్యులర్‌ డిస్కౌంట్‌ కార్డు కూడా..
సాధారణ రోజుల్లో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండేలా గతంలో తీసుకొచ్చిన 10 శాతం రాయితీని కూడా ఎత్తేశారు. ఈ కార్డుతో ఉద్యోగులు ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. నిత్యం ఆఫీజులకు ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా తక్కువ చార్జీలతో ప్రయాణం చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి వరకు రాయితీతో ప్రయాణించే వీలుండేది. దీనిని కూడా మెట్రో అధికారులు ఎత్తివేశారు.

పెరిగిన రద్దీ కారణంగా..
గతంలో మెట్రో ప్రయాణానికి ఆదరణ తక్కువగా ఉండేది. దీంతో ప్రారంభమైన నాటి నుంచి మెట్రో సంస్థ నష్టాల్లోనే నడుస్తోంది. లాభాల కోసం, ప్రయాణికులను పెంచుకునేందుకు రాయితీ కార్డులు అందుబాటులోకి తెచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మెట్రో ప్రయాణికులు క్రమంగా పెరుగుతున్నారు. ఇక ఈ వేసవిలో బస్సుల్లో ప్రయాణించే వారికన్నా మెట్రోలోని ఏసీ బోగీల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మెట్రోకు ఆదరణతోపాటు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో రాయితీలను ఎత్తివేసినట్లు తెలుస్తోంది.

చార్జీలు పెంచే ఆలోచన..
రాయితీల ఎత్తివేతతోనే ఆగే అవకాశం కనిపించడం లేదు. మే నెలలో మెట్రో రైలు చార్జీలు కూడా పెరుగుతాయని కొందరు పేర్కొంటున్నారు. డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా రద్దీ ఉన్నప్పుడే లాభాలు రాబట్టుకునేందుకు మెట్రో రైల్‌ అధికారులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మే 1 నుంచి చార్జీలు కూడా పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది.