https://oktelugu.com/

Glenn Maxwell: ఐదు మ్యాచ్ ల్లో 32 పరుగులా.. కొంచమైనా ఉండక్కర్లా!

తొలి వికెట్ కు విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ మెరుగైన ఆరంభాన్ని ఇస్తే..డూప్లెసిస్ అవుట్ అయిన తర్వాత వచ్చిన మాక్స్ వెల్ నిరాశ జానకమైన ఆటతీరు ప్రదర్శించాడు.

Written By: , Updated On : April 7, 2024 / 03:42 PM IST
Glenn Maxwell

Glenn Maxwell

Follow us on

Glenn Maxwell: అతడేం అనామక బ్యాటర్ కాదు. ఈ సంవత్సరమే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అతడు దూకుడుకు పర్యాయపదం. మెరుపు ఇన్నింగ్స్ కు నానార్థం. గత ఏడాది జరిగిన మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లో ఆఫ్గనిస్తాన్ పై ఏకంగా డబుల్ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్లో తన జట్టును గెలిపించి.. ఏకంగా ఫైనల్ దాకా తీసుకొచ్చాడు. కానీ అలాంటి ఆటగాడు ఐపీఎల్ లో తేలిపోతున్నాడు. మిడిల్ ఆర్డర్లో వస్తూ టెయిల్ ఎండర్ లాగా ఆడుతున్నాడు. అంతేకాదు దారుణంగా బ్యాటింగ్ చేస్తూ పరువు తీసుకుంటున్నాడు. చూడబోతే ఐపీఎల్ ఆడటం ఇష్టం లేదో అన్నట్టుగా ఉంది అతడి బ్యాటింగ్ స్టైల్.

పై ఉపోద్ఘాతమంతా బెంగళూరు బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ గురించే. వాస్తవానికి అతడు బ్యాటింగ్ చేస్తే బౌలర్లు వణికి పోతారు.. బంతులు మైదానం అవతలపడతాయి. ఫోర్లు అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా.. సిక్స్ ల మీదనే మోజు అన్నట్టుగా ఉంటుంది అతని బ్యాటింగ్ స్టైల్. తుఫాన్ కు పర్యాయపదంగా, మెరుపుకు ప్రతిపదార్థంగా, దూకుడుకు సిసలైన అర్థం గా అతని బ్యాటింగ్ ఉంటుంది. అందుకే బెంగళూరు ఏరి కోరి అతన్ని కొనుక్కుంది. కానీ అతడేమో దారుణమైన బ్యాటింగ్ తో పరువు తీసుకుంటున్నాడు. బెంగళూరు జట్టును ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. బెంగళూరు ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడితే.. కేవలం పంజాబ్ మీద మాత్రమే గెలిచింది. చివరికి సొంత మైదానంలో ప్రత్యర్థి జట్లపై గెలవలేని స్థితికి చేరుకుంది. ముఖ్యంగా రాజస్థాన్ చేతిలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఓడిపోయిన విధానం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తొలి వికెట్ కు విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ మెరుగైన ఆరంభాన్ని ఇస్తే..డూప్లెసిస్ అవుట్ అయిన తర్వాత వచ్చిన మాక్స్ వెల్ నిరాశ జానకమైన ఆటతీరు ప్రదర్శించాడు. చెప్పుకోదగ్గ స్కోర్ చేయకుండానే అవుట్ అయ్యాడు. ఒకవేళ అతడు గనుక నిలబడి ఉండే బెంగళూరు మరింత స్కోరు చేసేది. అప్పుడు రాజస్థాన్ ఎదుట భారీ లక్ష్యాన్ని ఉంచేది. కానీ ఆ అవకాశాన్ని మాక్స్ వెల్ ఇవ్వలేదు. పైగా అనామక ఆటగాడిగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు..

మ్యాక్స్ వెల్ ఈ సీజన్లో బెంగళూరు తరఫున ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడాడు. కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతగాడు వ్యక్తిగత అత్యధిక స్కోరు 28 పరుగులు. మాక్స్ వెల్ లాంటి ఆటగాడి స్థాయికి ఇటువంటి ఇన్నింగ్స్ ఏమాత్రం శోభనివ్వవు. అటు బౌలింగ్ లోనూ మాక్స్ వెల్ తేలిపోతున్నాడు. కేవలం ఇప్పటివరకు నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.. ఈ నేపథ్యంలో అతడిని జట్టులో కొనసాగించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. “అతడు ఎలాగూ ఆడలేడు. ఐపీఎల్ అంటే ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఐదు మ్యాచ్ ల్లో 32 పరుగులు చేశాడు. అతడికి కొంచెమైనా ఉండాలి. అలాంటప్పుడు అతని స్థానంలో వేరొకరిని తీసుకుంటే బాగుంటుంది కదా” అని అభిమానులు బెంగళూరు జట్టు యాజమాన్యానికి సలహా ఇస్తున్నారు.. వీలైనంత తొందరలో అతడిని పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. “జట్టు ఇప్పటికే పరువు పోగొట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో మిగిలిన మ్యాచ్ ల్లో కచ్చితంగా గెలవాలి అంటే మార్పులు చేయాల్సిందే” అంటూ బెంగళూరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై బెంగళూరు యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.