BRS BSP Alliance: తెలంగాణలో కొత్త పొత్తు పొడవబోతోంది. పదేళ్లు అవసరం మేరకు చిన్న పార్టీలను వాడుకున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు పార్టీ ఉనికి కాపాడుకునేందుకు పొత్తుబాట పట్టారు. ప్రస్తుతం తెలంగాణలో ఆయనను ఏ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆయన బీఎస్పీ మద్దతు కోరుతున్నారు. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను హైదరాబాద్‌లోని తన ఇంటికి పిలిపించుకుని చర్చలు జరిపారు. తర్వాత ఇద్దరూ ప్రెస్‌మీట్ పెట్టి పార్లమెంటు ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.
అభ్యర్థులు లేకనే..
పదేళ్లు తెలంగాణలో ఏకఛత్రాధిపత్యం సాగించిన బీఆర్‌ఎస్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో పరిణామాలు క్రమంగా మారిపోతున్నాయి. పదేళ్లు బీఆర్‌ఎస్ వెంట ఉన్న నేతలు పార్టీ మారుతున్నారు. అధికార కాంగ్రెస్‌లోకి కొందరు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి కొందరు ఇప్పటికే జంప్ అయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 9 ఎంపీ సీట్లు గెలిచింది. 2023 ఎన్నికల ఫలితాల తర్వాత ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు బీఆర్‌ఎస్‌ను వీడారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత కాంగ్రెస్‌లో చేరగా, జహీరాబాద్ ఎంపీ బీబీ.పాటిల్, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరారు. వరంగల్ ఎంపీ ఆరూరి రమేశ్ కూడా బీజేపీతో మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. బొతు రామ్మోహన్, తీగల కృష్ణారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి లాంటి సీనియర్లు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఇక మిగతా సిట్టింగ్ ఎంపీలు కూడా బీఆర్‌ఎస్ నుంచి పోటీకి వెనుకాడుతున్నారు. దీంతో పదేళ్ల ఓవర్‌లోడ్‌తో ఇబ్బంది పడ్డ బీఆర్‌ఎస్ ఇప్పుడు అభ్యర్థులు లేక పొత్తుల కోసం పాకులాడుతోంది.
బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు..
పొత్తులో భాగంగా బీఆర్‌ఎస్ బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు కేటాయిస్తుందని తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ టికెట్ బీఎస్పీ చీఫ్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ పోటీ చేస్తారని సమాచారం. మరో టికెట్ ఎక్కడ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. 17 సీట్లలో హైదరాబాద్ ఎంఐఎంకు పోను, రెండు బీఎస్పీకి ఇస్తుంది. దీంతో మిగతా 14 స్థానాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయనుంది.
సారు.. కారు.. 14..
2019లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సారు.. కారు.. 16.. కేంద్రంలో సర్కారు నినాదంతో ముందుకు వెళ్లింది. కానీ, ఇప్పుడు సారు.. కారు.. 14 నినాదం అందుకుంటుంది. ఈ 14లో నాలుగు గెలిచినా గొప్పే అన్న చర్చ గులాబీ భవన్‌లోనే జరుగుతోంది. మరోవైపు కేసీఆర్ కుటుంబంలో ఒకరిద్దరు ఎంపీకి పోటీ చేయాలని క్యాడర్ కోరుతోంది.
పొత్త చిచ్చు..
ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తు గులాబీ పార్టీలో చిచ్చు చేపుతోంది. గత ఎన్నికల్లో బీఎస్పీ చీఫ్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ నుంచి పోటీ చేశాడు. అక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప, బీజేపీ నుంచి హరీశ్‌బాబు పోటీ చేశారు. చివరకు బీజేపీ గెలిచింది. అయితే తన ఓటమికి బీఎస్పీ కారణమని కోనప్ప భావిస్తున్నారు. ఆ ఎన్నికల్లో ప్రవీణ్‌కుమార్‌కు 40 వేలకుపైగా ఓట్లు వచ్చాయి. కోనప్ప 10 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అందుకే బీఎస్పీ చీఫ్ కారణంగా ఓడినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఎస్పీ, బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకోవడం కోనప్పకు నచ్చడం లేదు. తనను ఓడించిన వ్యక్తితో కలిసి ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మల్యేలు..
ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే కోనప్పతోపాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. బీఎస్పీతో పొత్తు కారణంగా చూపి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు కాంగ్రెస్తో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. మార్చి 13 లేదా 14వ తేదీల్లో కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. మొత్తంగా కొత్తపొత్తు బీఆర్‌ఎస్‌లో చిచ్చు పెట్టినట్లు కనిపిస్తోంది.