Revanth Reddy : మూసీ పేరు పెట్టొద్దా.. రేవంత్ చెప్పిన లాజిక్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే!

మూసి ప్రక్షాళన దిశగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మూసి పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను గుర్తించింది.. వీరిలో కొంతమందికి డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించింది. మరి కొంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇంటి తో పాటు 25 వేల పరిహారం కూడా అందించేందుకు రంగం సిద్ధం చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 6, 2024 9:43 pm

Moosi Cleansing

Follow us on

Revanth Reddy : మూసి ప్రక్షాళన సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి మండిపడుతోంది. నర్మదా రివర్ ఫ్రంట్, ఇతర నదుల ప్రక్షాళన కోసం పెట్టిన ఖర్చు కంటే మూసి ప్రక్షాళన కోసం పెడుతున్న ఖర్చు ఎక్కువని భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికలలో పలు నివేదికలు చూపించి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ చేసిన ఆరోపణలపై స్పందిస్తోంది.. ఇంతవరకు టెండర్లే ఖరారు కానప్పుడు.. అందులో అక్రమాలకు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నిస్తోంది. మూసి ప్రక్షాళన కాలేశ్వరం ఎత్తిపోతల పథకం, యాదాద్రి గుడి నిర్మాణం లాగా ఉండదని.. ఇందులో పెట్టే ప్రతి పైసా ఖర్చుకు లెక్క ఉంటుందని వివరిస్తున్నది. ఇటీవల మూసి పరివాహక ప్రాంతంలో ఆక్రమించి కట్టిన నిర్మాణాలను రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం పడగొట్టింది. అయితే ఇది సహజంగానే వివాదానికి దారి తీసింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి మండిపడింది. ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మూసి ప్రభావిత ప్రాంతాల వద్దకు వెళ్లారు. ప్రజలతో మాట్లాడారు. ఇళ్లను కూలగొట్టడానికి వచ్చే వారిని చీపుళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు.. దీంతో ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మూసి ప్రక్షాళన ఉద్దేశాన్ని ప్రకటించారు. ఆయన వేదికపై ఉండి చేసిన ప్రసంగం ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది…

కచ్చితంగా పేరు పెట్టుకోవాలి

మూసి అనగానే మనలో చాలామందికి మురికి గుర్తుకొస్తుంది. వ్యర్ధాలు, విషపూరితమైన రసాయనాలతో మూసీ నది మురికి నదిగా మారిపోయింది. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో మూసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. దానికోసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించారు. మూసి వెంట ఉన్న అక్రమ నిర్మాణాలను పడగొట్టాలని నిర్ణయించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని.. ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టారు. అయితే భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయిన తర్వాత.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే మూసి ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక ప్రణాళికలు రూపొందించింది. ఇదే క్రమంలో మూసి ప్రక్షాళన భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తప్పు పడుతుండగా.. రేవంత్ రెడ్డి మాత్రం తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని సమర్థించుకున్నారు..” మన ఇళ్లల్లో ఆడపిల్లలకు గంగ, యమునా, సరస్వతి, గోదావరి, కృష్ణ అనే పేర్లు పెడుతున్నాం. కానీ మూసి అని పెట్టలేకపోతున్నాం. మూసి మురికి వదిలించే ప్రయత్నం నేను తీసుకుంటా. ఇకపై మన పిల్లలకు మూసి అనే పేరు పెట్టుకునే పరిస్థితి నేను తీసుకొస్తాను. ప్రతిపక్షాలు ఏవేవో విమర్శలు చేస్తున్నాయి. వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మూసి ప్రక్షాళన బాధ్యత నేను భుజాలకి ఎత్తుకున్నాను కాబట్టి.. దానిని పూర్తిచేసే తీరుతానని” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తానికి మూసి విషయంలో వెనకడుగు వేసేది లేదని ప్రకటించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమర్ధిస్తుండగా.. భారత రాష్ట్ర సమితి శ్రేణులు విమర్శిస్తున్నాయి.