Revanth Reddy: రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదివి చేపట్టాక దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ అంశంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. పార్టీలో సీనియర్లను పట్టించుకోవడం లేదనే విమర్శ ఉన్నప్పటికీ.. క్యాడర్‌లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగే ప్రతి విషయంపై అప్‌డేటెడ్‌గా ఉంటున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని తన ప్రశ్నలతో సంధిస్తూనే ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతీ సారి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూనే ఉన్నారు.

దేవులపల్లి ప్రభాకర్ రావు కనిపించడం లేదంటూ కామెంట్స్..
ఎప్పుడూ కేసీఆర్‌పై, టీఆర్ఎస్ పాలనపై ఏదో ఒక విమర్శ చేసుకుంటూ ఉండే రేవంత్ రెడ్డి.. తాజాగా మరో బాంబు పేల్చారు. తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు ఎక్కడా కనిపించడం లేదంటూ కామెంట్ చేశారు. ఆయన కనిపించకపోవడం వెనక తెలంగాణ ప్రభుత్వం కుట్ర దాగి ఉందని ఆరోపించారు. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టుల కోసం ప్రభాకర్‌రావు చాలా కష్టపడ్డారని గుర్తు చేశారు. ఆయన సాయం వల్లే పవర్ కార్పోరేషన్ నుంచి 35 వేల కోట్ల అప్పును తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. అయితే దానికి వడ్డీ, ఉద్యోగులకు జీతం, మిగితా ఖర్చులు అన్నీ కలిపి రూ.1200 వేల వరకు అవుతుందని, దీనిపై నివేదిక ఇవ్వడం వల్లనే ప్రభాకర్ రావు కనిపించకుండా పోయారని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ప్రస్తుతం ప్రభాకర్ రావు నిర్వహిస్తున్న బాధ్యతలను సింగరేణి సీఎండీకి అప్పజెప్పారని విమర్శించారు. దీని వెనక ఏదో కుట్ర జరుగుతోందని అన్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ విద్యుత్తు సంస్థ అభివృద్ధిలో ప్రభాకర్ రావు పాత్ర ఎంత ?
ఇప్పుడు తెలంగాణలో కరెంటు కోతలు లేకుండా, నిర్విరామంగా 24 గంటలు కరెంటు సరఫరా కావడం వెనక దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రాత్ర ఎంతో ఉంది. తెలంగాణ వస్తే రాష్ట్రం అందకారం అవుతుందనే ఏపీ పాలకుల మాటలను సీఎం కేసీఆర్ ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. వారి మాటలు నిజం కాకుండా ఉండేందుకు కేసీఆర్ ఈ దేవులపల్లి ప్రభాకర్ రావు సాయం తీసుకున్నారు. అందుకే ఆయను తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్ కో లకు సీఎండీ బాధ్యతలు అప్పగించారు. ప్రభాకర్ రావుకు తెలంగాణలో విద్యుత్ పరిస్థితి, పంపిణీ, వ్యవస్థ, మిగితా అంశాల పట్ల ఎంతో అనుభవం, అవగాహన ఉంది. పవర్ ప్లాంట్ల ఏర్పాట్లలో, కరెంటు కోతలు లేకుండా నిర్విరామంగా విద్యుత్ సరఫరా, ఉద్యోగుల నియామకం వంటి అన్ని విషయాల్లో ప్రభాకర్ రావు ప్రమేయం ఉంది. విశేష అనుభవం, అవగాహన సీఎం కేసీఆర్ కు ఎంతో ఉపయోగపడింది. అలాంటి వ్యక్తిపై ఆయనపై ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉందన్న విషయం ప్రభుత్వమే ప్రజలకు తెలియజేయాల్సి ఉంది.