New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులతోపాటు ఉన్న రేషన్ కార్డులో చేరికలు, తొలగింపుల కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో మినహా గత సర్కార్ కొత్తగా ఎవరికీ రేషన్ కార్డు జారీ చేయలేదు. కనీసం కుటుంబ సభ్యులు పేర్లు చేర్చే అవకాశం కూడా ఇవ్వలేదు. తాము అధికారంలోకి వస్తే అర్హులందరికీ రేషన్‌కార్డులు జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ గెలుపులో ఇదీ ఒక కారణమే. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కొత్త కార్డుల జారీకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. 2025, జనవరి 26 నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. రేషన్ కార్డులకు సంబంధించిన ఇప్పటికే అందిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
గైడ్‌లైన్స్ విడుదల..
రేషన్ కార్డుల జారీకి సంబంధిచి తెలంగాణ ప్రభుత్వం జనవరి 13న గైడ్‌లైన్స్ విడుదల చేసింది. రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్‌కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేసింది.
1. కులగణన సర్వే ఆధారంగా రేషన్‌కార్డు లేని కుటుంబాల జాబితా ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు.
మండలస్థాయిలో ఎంపీడీవో, పట్టణస్థాయిలో మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు.
జిల్లాస్థాయిలో అదనపు కలెక్టర్లు, డీసీఎస్‌వోలు పర్యవేక్షిస్తారు.
రేషన్‌కార్డుల దరఖాస్తుల ఆధారంగా అర్హుల జాబితా గ్రామసభలో చదివి వినిపిస్తారు. ఈ గ్రామ సభలో జాబితాపై చర్చించి ఆమోదిస్తారు.
గ్రామసభ లేదా వార్డు సభలో ఆమోదించిన జాబితాను మండల, మున్సిపల్ అధికారులు కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు పంపుతారు.
ఈ జాబితాపై కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ తుది నిర్ణయం తీసుకుంటారు. తర్వాత కార్డులు జారీ చేస్తారు.
మార్పులు, చేర్పులు..
ఇక రేషన్‌కార్డులో పేర్ల మార్పులు, చేర్పుల కోసం ప్రభుత్వం అవకాశం కల్పించింది. సభ్యుల పేర్లకు సంబంధించి ఆధార్ కార్డులు, మ్యారేజీ సర్టిఫికెట్లు అధికారులకు అందించాలి. అంతేకాదు సంబంధిత సభ్యుల బర్త్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాపాలన సమయంలో రేషన్‌కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించారు. అయితే అప్పట్లో దరఖాస్తు చేయనివారు ఆన్‌లైన్‌లో దరకాస్తు చేసుకోవచ్చు. రేషన్‌కార్డును ఏడాదికి కుటంబానికి వచ్చే ఆదాయం ప్రామాణికంగా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతంలో ఏటా రూ.1.50 లక్షల ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉన్నవారికి జారీ చేస్తారు.