Telugu News » Telangana » Revanth reddy sarkar has transferred senior officers in telangana police department
CM Revanth Reddy : రేవంత్ ఏరి కోరి తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి పై వేటు దేనికి వేసినట్టు… సివి ఆనంద్ కు మళ్లీ హైదరాబాద్ ఎందుకు అప్పగించినట్టు?
శనివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మొత్తం వినాయక చవితి సంబరాల్లో ఉండగా.. ప్రభుత్వం మాత్రం పోలీస్ శాఖలో సీనియర్ అధికారులకు అనూహ్యంగా బదిలీలు నిర్వహించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ముఖ్యంగా కీలక స్థానంలో ఉన్న అధికారులకు స్థానచలనం కలిగించింది. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా కలకలం నెలకొంది.
CM Revanth Reddy : హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పై రేవంత్ ప్రభుత్వం వేటు వేయడం సంచలనం కలిగించింది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగర సిపిగా పనిచేసిన ఆనంద్ కు రేవంత్ ప్రభుత్వం తిరిగి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టు ఇచ్చింది. రేవంత్ తీసుకున్న నిర్ణయం తెలంగాణలో సంచలనంగా మారింది. వినాయక చవితి నాడు దాదాపు ఐదుగురు సీనియర్ ఐపిఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ నగర్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి స్థానచలనం కలిగించింది. వాస్తవానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీనివాసరెడ్డిని ప్రత్యేకంగా హైదరాబాద్ నగర కమిషనర్ గా నియమించారు. ఏరి కోరి తెచ్చుకున్న అధికారిపై ఆయన బదిలీ వేటు వేయడం సంచలనంగా మారింది. అప్పట్లో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సివి ఆనంద్ కేంద్ర సర్వీసులో ఉన్నారు. ఆయనప్పటికీ ఆయనను ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి పిలిపించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా నియమించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో..
తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో డిజిపి అంజనీ కుమార్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ ను ఎన్నికల సంఘం పక్కన పెట్టింది. ఆ తర్వాత రేవంత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సివి ఆనంద్ ను ఏసీబీ డీజీగా రేవంత్ నియమించారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిరక్షణపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వాటి ఆరోపణలకు తగ్గట్టుగానే హైదరాబాద్లో పరిస్థితులు ఉన్నాయి. దీంతో రేవంత్ శ్రీనివాస్ రెడ్డిని పక్కనపెట్టి.. ఆనంద్ వైపు మొగ్గు చూపించారని తెలుస్తోంది.
ఆనంద్ కు అనుభవం ఎక్కువ
శ్రీనివాస్ రెడ్డి కంటే ఆనంద్ కు హైదరాబాద్ నగరం పై పట్టు ఎక్కువగా ఉంది. గతంలో ఆయనకు హైదరాబాద్ నగర కమిషనర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. పైగా హైదరాబాదులో శనివారం నుంచి గణపతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొద్దిరోజుల్లోనే నిమజ్జనం ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు రేవంత్ తన మానస పుత్రికగా అభివర్ణిస్తున్న హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలు రోజురోజుకు సంచలనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు స్థాన చలనం కలిగించి.. ఆ ప్లేస్ లో సివి ఆనంద్ ను రేవంత్ నియమించాలని తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీగా నియమించారు. విజయ్ కుమార్ కు ఏసీబీ డీజీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. వీరు మాత్రమే కాకుండా త్వరలోనే మరికొందరు సీనియర్ అధికారులకు ఇలాగే స్థానచలనం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది.