Vijayawada : బుడమేరుకు గండ్లు పడటంతో వరద నీరు భారీగా చేరి పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో లక్షల మంది జనం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ పలు కాలనీలు నీటిలోనే నానుతున్నాయి. ఆర్మీ చొరవతో రాష్ట్ర ప్రభుత్వం బుడమేరుకు పడిన 3 గండ్లను పూడ్చింది. శనివారం సాయంత్రం నాటికి మూడవ గండిని ఆర్మీ అధికారులు పూర్తి చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు, మరో మంత్రి నారా లోకేష్ అక్కడే ఉండి పనులను నిరంతరం పర్యవేక్షించారు. అధికారులు కూడా రాత్రి పగలు అక్కడే ఉన్నారు. దీంతో విజయవాడ నగరానికి బుడమేరు వరద నీరు ముంచెత్తకుండా అడ్డుగడ్డ వేసినట్టయింది. అయితే ఇప్పటివరకు నగరంలోకి వచ్చిన వరద నీటిని తోడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై పడింది. అయితే ఈ నీటిని తోడి ఎక్కడికి పంప్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆ నీటిని కృష్ణానది లోకి పంప్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆలోచనను ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు.
విజయవాడకు మరో ప్రమాదం
బుడమేరు మూడవ గండిని పూడ్చుతున్న సమయంలో విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది. మరోవైపు శుక్రవారం నుంచి బుడమేరుకు ప్రవాహం పెరుగుతోంది. వరద కూడా భారీగా వస్తోంది. ఇది ఇలా ఉండగానే శనివారం భారీ వర్షం కురవడంతో విజయవాడ నగరవాసులు వణికి పోతున్నారు. మరోవైపు నైరుతీ రుతుపవనాలు చురుకుగా ఉండడం, బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడటంతో వచ్చే రెండు రోజులు విజయవాడలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఈ ప్రభావం కృష్ణ, ఉభయగోదావరి జిల్లాలో, వరంగల్, ఖమ్మం పై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఖమ్మంలో విస్తారంగా కురిసిన వర్షాల వల్ల మున్నేరు ప్రవాహం తారస్థాయిని దాటిపోయింది. మున్నేరు ప్రవాహం వల్లే బుడమేరుకు వరద నీరు తాకిడి ఎక్కువైందని తెలుస్తోంది. అందువల్లే దానికి మూడు చోట్ల గండ్లు పడ్డాయని.. విజయవాడ నగరం మునిగిందని అక్కడి ప్రజలు అంటున్నారు.. ప్రస్తుతం ఆర్మీ సహాయంతో ఏపీ ప్రభుత్వం మూడు గండ్లను పూడ్చినప్పటికీ.. వాతావరణ శాఖ హెచ్చరికల జారీ చేయడంతో విజయవాడ ప్రజలు భయంతో వణికి పోతున్నారు. రేపటి నాడు ఏమవుతుందో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వర్షం కురిసి మళ్ళి బుడమేరు పొంగినా విజయవాడ నగరానికి ఏమీ కాదని అధికారులు అంటున్నారు. అయితే ఇటీవల వరదల వల్ల ఎదురైన అనుభవాలను చవిచూసిన విజయవాడ వాసులు మాత్రం.. వర్షం అంటే చాలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో సోమవారం దాకా విజయవాడ లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.