Congress CLP Meeting : కులగణన సర్వే తర్వాత.. దాని నివేదికను అందజేయడానికి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లాల్సి ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీని కలవాల్సి ఉండేది. కానీ హఠాత్తుగా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ భేటీ ఉందని.. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం హాజరు కావాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ ప్రారంభమైంది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల ప్రభుత్వం కులగణన, ఎస్సీ వర్గీకరణను చేపట్టింది. అయితే దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి వ్హాలు రచించాలనే విషయంపై ఈ భేటీలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పైకి ఈ కారణాలు కనిపిస్తున్నప్పటికీ.. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీనిని ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి మరో విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. మంత్రుల అవినీతి వల్ల ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారని.. అందువల్లేవారు భేటీ అయ్యారని ప్రచారం చేసింది. అయితే దీనిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించలేదు. అలాగని సమర్థించలేదు. భేటీ అయ్యారని మాత్రం చెప్పారు. అయితే ఈ పరిణామం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి అసంతృత ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తర్వాత పిసిసి అధ్యక్షుడు అసంతృప్త ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలుస్తోంది.. ప్రధానంగా సిఎల్పీ భేటీలో అసంతృప్త ఎమ్మెల్యేల పైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వం చేసిన కుల గణన సర్వేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. ఉ* పోసి ఆ గణన నివేదికను తగలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ పరిణామాలు ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారిన నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షి కూడా పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కుల గణన సర్వే, బడ్జెట్ వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను బలోపేతం చేసే విషయంపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.. ఈ భేటీలో ముఖ్యమంత్రి, ఇతర పార్టీ పెద్దలు జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీ లతో సమావేశం అయినట్టు తెలుస్తోంది.. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల్లో గెలుపొందడం, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిని నిలువరించడం వంటి విషయాలపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.. అయితే త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో.. దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో కొంతమంది ఎమ్మెల్యేలు తాము కోరిన పనులు చేయడం లేదని.. తమ నియోజకవర్గంలో కొంతమంది మంత్రుల పెత్తనం ఎక్కువైపోయిందని వాపోయినట్టు తెలిసింది. దీంతో రేవంత్ రెడ్డి ఇకపై అలా జరగదని.. కచ్చితంగా మీరు కోరుకున్న విధంగా పనులు జరుగుతాయని.. పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని.. అధికార సుస్థిరతకు సహకరించాలని సూచించినట్టు తెలుస్తోంది. మంత్రులు మీకు సహకరిస్తారని.. ఎవరు ఎటువంటి ఇబ్బంది పెట్టరని.. ఈ విషయంలో అపోహలకు తావు లేదని ముఖ్యమంత్రి సూచించినట్టు సమాచారం. అయితే ఈ సీఎల్పీ భేటీలో ఇంకా అనేక విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.