Revanth Reddy : దేశం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కనిపించిన ఆశాదీపం డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆర్థిక శాస్త్రంలో నిపుణుడైన ఆయన పంజాబ్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్, మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత కేంబ్రిడ్జిలో కూడా బ్యాచిలర్స్ పూర్తి చేసి ఆక్స్ ఫర్డ్ లో డాక్టరేట్ కంప్లీట్ పొందాడు. ఉన్నతమైన యూనివర్సిటీల నుంచి పట్టాలు పొంది దేశ ఆర్థిక ప్రగతిని మార్చేందుకు ఇండియా వచ్చాడు. మొదట సీనియర్ లెక్చరర్ గా, తర్వాత రీడర్, ఆ తర్వాత ప్రొఫెసర్, గౌరవ ప్రొఫెసర్ లాంటి విధులు నిర్వర్తించాడు. పీవీ నర్సింహా రావు ప్రధానిగా పని చేస్తున్న సమయంలో దేశం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. పీవీ చాలా మేధావి ఎంతలా అంటే ఎవరిని ఏ పదవిలో పెడితే ఎలా పని చేస్తారన్నదానిపై ఆయనకు పక్కాగా వ్యూహం ఉంటుంది. అందుకే పీవీ నర్సింహా రావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్ లో మన్మోహన్ ను ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారు. మన్మోహన్ సమయంలోనే దేశ ఆర్థిక రంగంలో అనేక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక రంగం వేగంగా గాడినపడింది. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కంపెనీలకు భారత్ తలుపులు తెరిచింది.
మొదట మీ కంపెనీని ఏర్పాటు చేసుకోండి. ఉత్పత్తిని ప్రారంభించండి.. ఆ తర్వాత అనుమతులు తీసుకోండి అంటూ చెప్పిన మొదటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్. అంటే ఇతర దేశాల కంపెనీలు వస్తే ఎగుమతి పెరుగుతుంది. దీంతో పాటు తక్కువ ధరకు వస్తువులు దొరుకుతాయి. ఇంకా ఎంప్లాయ్‌మెంట్ కూడా పెరుగుతుంది. ఈ విధానాలతో పీవీ వద్ద మన్ననలు పొందాడు మన్మోహన్.
ఇక, పీవీ తర్వాత యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా పని చేశారు మన్మోహన్ సింగ్. రెండు దఫాలుగా ప్రధాని పీఠం అధిరోహించారు. ఎన్నో సంస్కరణలు తెచ్చారు. నేడు శాస్త్ర సాంకేతిక రంగం వేగంగా దూసుకెళ్లడంతో పీవీ తర్వాత మన్మోహన్ చేసిన కృషి ఎక్కువగా ఉండని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మరణం భారత జాతికి తీరని లోటనే చెప్పాలి.
మన్మోహన్ కు నివాళులర్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయన విగ్రహం ఏర్పాటుపై ఇప్పటికే ప్రకటించారు. హైదరాబాద్ లోని ప్రధాన జంక్షన్ కు ఆయన పేరుపెట్టి ఆయన విగ్రహం పెట్టాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన రేవంత్ ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా.., ప్రధానిగా ఉన్న సమయంలో దేశ ప్రగతిని గుర్తు చేశారు.
ఏ పదవి లేకున్నా చాలా సందర్భాల్లో ఆయన సలహాలు, సూచనలు జాతికి అందించారని కొనియాడారు. కేవలం విగ్రహం ఏర్పాటే కాదు.. ఏదైనా పథకానికి మన్మోహన్ పేరు పెట్టాలని కూడా అనుకుంటున్నట్లు చెప్పుకచ్చారు. ఇక రేపు (డిసెంబర్ 31) జరిగే శాసనసభ ప్రత్యేక సమావేశంలో రేవంత్ దీని గురించి ప్రస్తావించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే తెలంగాణలో మన్మోహన్ మొదటి విగ్రహం ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆయన పేరుతో వచ్చే పథకం కూడా మొదట తెలంగాణలో వచ్చే అవకాశం లేకపోలేదు. ఇలా ఆయనపై రేవంత్ తన ప్రేమను చాటుకున్నారు.